
యంగ్ హీరో నాని నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ మాళవిక నాయర్. మొదటి తెలుగు సినిమాలో అల్లరి పిల్లగా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో తను చూపిన పెర్ఫార్మన్స్ పరంగా తనకి నందిని రెడ్డి డైరెక్షన్ లో రెండవ సినిమా ఛాన్స్ వచ్చిందని ఇది వరకే తెలియజేశాం. నాగ శౌర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళింది.
ప్రస్తుతం హైదరాబాద్ లోని పలు లోకేషన్స్ లో ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా సెట్లో మాళవిక నాయర్ అందరినీ తన లుక్ తో సర్ప్రైజ్ చేస్తోందట. ఈ సినిమా కోసం మాళవిక నాయర్ చాలా వెయిట్ తగ్గడమే కాకుండా తన ముందు సినిమాకి సంబంధం లేకుండా పూర్తి స్టైలిష్ మేకోవర్ తో సెట్లో కనపడడంతో అందరూ షాక్ కి గురవుతున్నారట. అంతే కాకుండా పాత్ర కోసం తను చూపుతున్న డెడికేషన్ ని చూసి అందరూ మెచ్చుకుంటున్నారట. ఇలా సెట్లో అందరినీ ఆకర్షిస్తోన్న ఈ మలయాళ ముద్దుగుమ్మ ఆన్ స్క్రీన్ ప్రేక్షకులను ఎంత వరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.
‘అలా మొదలైంది’ ఫేం కెఎల్ దామోదర్ ప్రసాద్ శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ కోడూరి సంగీతం అందిస్తున్నాడు. నందిని రెడ్డి మరోసారి యువతను ఆకట్టుకోవాలని పర్ఫెక్ట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా కథని రెడీ చేసినట్లు సమాచారం.

