సమీక్ష : మల్లేశం – ఆసక్తికరంగా సాగిన “మల్లేశం” జర్నీ !

Published on Jun 22, 2019 3:01 am IST
Mallesham movie review

విడుదల తేదీ : జూన్ 21, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : ప్రియదర్శి, అనన్య, ఝాన్సీ త‌దిత‌రులు.

దర్శకత్వం : రాజ్ ఆర్

నిర్మాత : రాజ్ ఆర్

సంగీతం : మార్క్ కే రాబిన్

సినిమాటోగ్రఫర్ : బాలు యస్

ఎడిటర్ : రాఘవేందర్ వి


చేనేత కార్మికుడు మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత ‘చింతకింది మల్లేశం’ జీవితం ఆధారంగా రాజ్ ఆర్ దర్శకత్వంలో యంగ్ కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “మల్లేశం”. కాగా ప్రియదర్శికి జోడిగా అనన్య నటించన ఈ సినిమా ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

ప్రియదర్శి (మల్లేశం) నేత కార్మికుల కుటుంబంలో పుట్టి పెరుగుతాడు. అతని కుటుంబం మొత్తం నేతపని చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే నేత పని వల్ల సరైన ఫలితం లేక ఆర్ధిక ఇబ్బందులతో నేత కార్మికులందరూ కష్టాలు పడుతుంటారు. దాంతో ఆరోగ్యం దెబ్బ తింటున్నా.. ఆసు పని చెయ్యాల్సి వస్తోంది. ఈ క్రమంలో నేత కార్మికురాలిగా తన తల్లి లక్ష్మీ (ఝాన్సీ) పడుతున్న కష్టాన్ని చిన్నప్పటి నుండి చూసిన మల్లేశం, తన తల్లిలాగా ఇంకెవ్వరూ కష్టపడకూడదని ఆసుయంత్రాన్ని కనుగొనాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తాడు. అయితే మల్లేశం ప్రయత్నాల్లో ఎన్నో అడ్డంకులు సమస్యలను ఎదురుకుంటున్న క్రమంలో తన తండ్రితో పాటు ఊర్లో అందరూ ఎగతాళి చేస్తారు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మల్లేశం ఆసుయంత్రాన్ని ఎలా కనిపెట్టాడు అనేదే మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

చేనేత రంగంలో నేత కార్మికులు పడుతున్న కష్టాలను.. వాళ్ళ జీవితాలను.. వాళ్ళ ఆలోచనలను ఆచారాలను ఇలా ప్రతి అంశాన్ని దర్శకుడు చక్కగా చూపించాడు. ముఖ్యంగా వాళ్ళు పడుతున్న కష్టాలను, తన తల్లి బాధను చూస్తూ పెరిగిన మల్లేశం సంఘర్షణను, ఆ సంఘర్షణల తాలూకులో నుండి పుట్టుకొచ్చిన ఆసు యంత్రం ఆలోచనలను, దర్శకుడు తెరపై ఆసక్తికరంగా గుండెకు హత్తుకునేలా తెరకెక్కించాడు.

ఆలాగే ఈ కథ జరిగిన నేపధ్యాన్ని కూడా కథకు అనుగుణంగా 90 కాలం నాటి ఫీలింగ్ తీసుకొస్తూ చాలా సహజంగా చూపించారు. సినిమా చూస్తున్నంత సేపు చేనేత కార్మికుల జీవితాలను మనం దగ్గరనుండి చూస్తున్న భావన కలుగుతుంది. అదే విధంగా దర్శకుడు రాజు ఆర్ రాసుకున్న సున్నితమైన ప్రేమ కథ కూడా ఈ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా రాజు ఆర్ భావోద్వేగమైన పాత్రలతో సున్నితమైన హాస్యాన్ని పండించిన విధానం అబ్బురపరుస్తుంది.

దాంతో పాటు కథలోని ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంటుంది. ప్రతి పాత్ర అర్ధవంతగా సాగుతూ కథను అంతర్లీనంగా ముందుకు నడుపుతుంది. ఇక నటీనటుల నటన విషయానికి వస్తే హీరోగా నటించిన ప్రియదర్శి అద్భుతంగా నటించాడు. ఇక ఏ పాత్ర అయినా అందుకు తగ్గట్టుగానే నటించే ఝాన్సీ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో అద్భుత నటన కనబర్చింది. అలాగే కీ రోల్ లో కనిపించిన అనన్య కూడా తన సహజ నటనతో ఆకట్టుకుంది. ఇక మల్లేశం ఫ్రెండ్స్ గా నటించిన నటులు, మల్లేశం తండ్రిగా నటించిన నటుడు కూడా మంచి నటన కనబర్చారు, వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు తగ్గట్లు నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

కథ, పాత్రల పరంగా ఎలాంటి వంకా పెట్టలేని పనితీరుని కనబర్చిన దర్శకుడు రాజు ఆర్ కథను మొదలు పెట్టడంలో మాత్రం చాలా నెమ్మదిగా కనిపించారు. ముఖ్యంగా చైల్డ్ ఎపిసోడ్స్ ను ఇంకా కుదించి ఉంటే బాగుండేది. అలాగే కథకు అవసరం లేని కొన్ని కామెడీ సీన్స్ ను తగ్గించాల్సింది. ఇక సినిమాలో కథనం కూడా స్లోగా సాగుతూ అక్కడక్కడా బోర్ కొడుతుంది.

సినిమా ట్రీట్మెంట్ పరంగా బాగునప్పటికీ.. స్క్రీన్ ప్లే మాత్రం సినిమా స్థాయికి తగ్గట్లు లేదు. అందరూ నూతన నటినటులందరూ బాగా నటించినా.. సినిమాలో స్టార్ వాల్యూ లేకపోవడంతో.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫలితాన్ని కొంతవరకు దెబ్బతీస్తుందనే చెప్పాలి. పైగా రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి అలవాటు పడ్డ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

 

సాంకేతిక విభాగం :

 

రాజ్ ఆర్ దర్శకుడిగా రచయితగా ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఫన్, ఎమోషన్ వంటి అంశాలని సమపాళ్లలో ఉంచి సగటు ప్రేక్షకుడిని అలరించే సినిమాను తయారుచేశారు. కాకపోతే సినిమా కథనం పై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

సంగీత దర్శకుడు మార్క్ కే రాబిన్ అందించిన సంగీతం అద్భుతంగా ఉంది. బాలు యస్ సినిమాటోగ్రఫీ సినిమాకి తగట్లు ఆకట్టుకుంటుంది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా సినిమా మూడ్ కి అనుగుణంగా నడుస్తాయి. నిర్మాత రాజు ఆర్ ను ఇలాంటి చిత్రాన్ని నిర్మిచినందుకు అభినందించి తీరాలి. నిర్మాత ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంటుంది.

 

తీర్పు :

 

పద్మశ్రీ అవార్డు గ్రహీత ‘చింతకింది మల్లేశం’ జీవితం ఆధారంగా రాజ్ ఆర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బలమైన సంఘర్షణతో, భావేద్వేగమైన ప్రేమ కథతో, సున్నితమైన హాస్యంతో ఆకట్టుకుంది. చేనేత రంగంలో నేత కార్మికులు పడుతున్న కష్టాలను.. వాళ్ళ జీవితాలను.. వాళ్ళ ఆలోచనలను ఆచారాలను ఇలా ప్రతి అంశాన్ని దర్శకుడు చక్కగా చూపించాడు. అయితే కథను మొదలు పెట్టడంలో మాత్రం దర్శకుడు కొంత నెమ్మదిగా కనిపించారు. ముఖ్యంగా చైల్డ్ ఎపిసోడ్స్ ను ఇంకా కుదించాల్సింది, అలాగే కథనం కూడా స్లోగా సాగుతూ అక్కడక్కడా బోర్ కొడుతుంది. కానీ సినిమా చూస్తున్నంత సేపు చేనేత కార్మికుల జీవితాలను మనం దగ్గరనుండి చూస్తున్న భావన కలుగుతుంది. మొత్తం మీద ఈ సినిమా మంచి చిత్రాలని కోరుకునే ప్రేక్షకులకు మంచి చాయిస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :