మంచు ఫ్యామిలీలో ‘దొంగాట’ ఎవరు ఆడతారు అనేది సస్పెన్స్ గా మారింది. విష్ణు, మనోజ్, లక్ష్మి ప్రసన్న.. ముగ్గురు మంచు వారసులు బ్రేక్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా మంచు ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై ‘దొంగాట’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. ఎవరి సినిమా కోసం ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారు అనేది ఆసక్తికరంగా మారింది.
అడవి శేష్, మంచు లక్ష్మి ప్రధాన పాత్రధారులుగా వంశికృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. ప్రముఖ హీరో రానా దగ్గుబాటి అతిధి పాత్రలో నటించారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ‘దొంగాట’ టైటిల్ రిజిస్టర్ చేయించినట్టు సమాచారం. ఈ సినిమాను మంచు ఎంటర్టైన్మెంట్ పతాకంపై మంచు లక్ష్మి స్వీయ నిర్మాణంలో రూపొందుతుంది. త్వరలో ఈ సినిమా వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.


