స్టార్ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది దర్శకులు ఈ నవలను సినిమాగా తీయాలని అనుకున్నా కుదరలేదు. ఎట్టకేలకు మణిరత్నం ఆ పని చేస్తున్నారు. లాక్ డౌన్ ముందు విదేశాల్లో షూటింగ్ జరిపారు. ఇక ఇండియా షెడ్యూల్ మొదలుపెట్టాలని అనుకుంటుండగా లాక్ డౌన్ విధించడంతో షూట్ కాస్త ఆగిపోయింది. లాక్ డౌన్ అనంతరం వెంటనే షూట్ మొదలుపెట్టాలని అనుకున్నా కూడ అందరు స్టార్లు బిజీగా ఉండటంతో వెంటనే రీస్టార్ట్ చేయడం కుదరలేదు.
తాజా సమాచారం మేరకు ఈ నెల 6వ తేదీ నుండి షూటింగ్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. మొదట జనవరి 10 నుండి చేయాలని అనుకున్నా కాస్త ముందుగానే మొదలుపెడుతున్నారు. ఈ షూటింగ్లో కార్తి, జయం రవిలు పాల్గొననున్నారు. ఈ నెలలోనే విక్రమ్ సైతం షూట్లో జాయిన్ అవుతారు. నటీనటులంతా ఈ సినిమా కోసం వేరే సినిమాను పక్కనబెట్టి డేట్స్ కేటాయిస్తున్నారు. ఈ పిరియాడికల్ డ్రామాలో విక్రమ్, అమితాబ్, ఐశ్వర్యరాయ్, కీర్తి సురేష్, త్రిష, నయనతార, విజయ్ సేతుపతి, ఐశ్వర్య లక్ష్మి, మోహన్ బాబు, జయరామ్ లాంటి ప్రముఖ స్టార్లు నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సంగీతాన్ని ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ అందిస్తుండగా కళా దర్శకుడిగా తోట తరణి వ్యవహరిస్తున్నారు.


