మరోసారి మానవత్వం చాటుకున్న మెగస్టార్ చిరంజీవి..!

Published on Aug 3, 2021 1:01 am IST

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ ఆపద వచ్చినా గుర్తొచ్చేది మెగస్టార్ చిరంజీవి పేరు. సాయం కోరి తన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి తనవంతు సాయం చేసే మంచి వ్యక్తిత్వం ఉన్న మెగస్టార్ చిరంజీవి తాజాగా కష్టాల్లో ఉన్న ఓ కో-డైరెక్టర్‌ను ఆదుకుని మరోసారి మానవత్వం చాటుకున్నాడు. దాస‌రి నారాయ‌ణ‌రావు దగ్గర కో-డైరెక్ట‌ర్‌గా పనిచేసిన ప్రభాకర్, చిరంజీవి నటించిన ‘లంకేశ్వరుడు’ చిత్రానికి సహ దర్శకుడిగా పనిచేశారు. అయితే ప్రస్తుతం ప్రభాకర్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసుకుని ఆయన కుమార్తె చదువుకు అయ్యే ఫీజును మెగస్టార్ సాయం చేశాడు.

అయితే దీనిపై ప్రభాకర్ మాట్లాడుతూ నేను దాస‌రి వ‌ద్ద కోడైరెక్టర్‌గా ప‌ని చేశానని, చిరంజీవి న‌టించిన లంకేశ్వ‌రుడికి కోడైరెక్ట‌ర్‌గా చేశానని, ఇటీవ‌ల ‘హెల్ప్ లైన్ అనే చిత్రాన్ని నిర్మించి నష్టపోయానని అన్నారు. మా అబ్బాయికి సీబీఐటీలో ఇంజినీరింగ్ పూర్తయి రెండేళ్లయ్యిందని డబ్బు కట్టలేక అతడి సర్టిఫికేట్లు తేలేదని అన్నారు. తన కూతురు బీబీఏ ఫైన‌ల్ ఇయ‌ర్‌ అని, పరీక్షలు రాయాలంటే 2.5 ల‌క్ష‌ల రూపాయలు ఫీజు కట్టాలని అంత డబ్బు కట్టలేక ఏం తోచని స్థితిలో చిరంజీవి గారిని ఆశ్రయించానని నా కష్టాలు విని పాప ఫీజు కోసం రూ.2.5 లక్షల రూపాయలను ఇచ్చారని అన్నారు. 30 ఏళ్ల క్రితం ‘లంకేశ్వరుడు’ సినిమా సమయంలో ఎంత ప్రేమగా చూసుకున్నారో, ఇప్పుడు కూడా అంతే ఆప్యాయంగా చూసుకున్నారని, ఆయనకు మా కుటుంబం ఎప్పటికే రుణపడీ ఉంటుందని ప్రభాకర్ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :