తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) 2026–2027 సంవత్సరానికి సంబంధించిన డైరీ, ఇన్సూరెన్స్ రెన్యువల్, ఐడి కార్డుల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై వీటిని లాంచ్ చేశారు. ప్రతి తెలుగు సంవత్సరాదికి జర్నలిస్టుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అసోసియేషన్ ఆనవాయితీగా వస్తోంది.
ఈ ఏడాది జర్నలిస్టుల సంక్షేమం కోసం TFJA కీలక నిర్ణయాలు తీసుకుంది. సభ్యుల కుటుంబాలకు (2+2) అందించే ఆరోగ్య బీమా కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. అలాగే, ప్రమాదవశాత్తు గాయపడి 2 నుంచి 12 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే, వారికి వారానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేలా ఒక ప్రత్యేక యాక్సిడెంట్ పాలసీని ప్రవేశపెట్టారు.
జర్నలిస్టుల గుర్తింపు కోసం రూపొందించిన ఐడి కార్డులను చిరంజీవి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు అందజేశారు. TFJA చేపడుతున్న ఈ సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అసోసియేషన్ అభివృద్ధి కోసం రూ.5 లక్షల చెక్కును విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో TFJA ప్రెసిడెంట్ వై.జె. రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, ట్రెజరర్ నాయుడు సురేంద్ర, పాలిట్బ్యూరో కన్వీనర్ వారణాసి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


