సమీక్ష : మిస్టర్.కె కె – స్టైల్ గా ఉన్నా… థ్రిల్ లేదు

సమీక్ష : మిస్టర్.కె కె – స్టైల్ గా ఉన్నా… థ్రిల్ లేదు

Published on Jul 20, 2019 3:01 AM IST
Mr.KK movie review

విడుదల తేదీ : జూలై 19, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.5/5

నటీనటులు : విక్రమ్, లీన, అక్షర హాసన్ త‌దిత‌రులు.

దర్శకత్వం : రాజేష్ ఎమ్ సెల్వ

నిర్మాత‌లు : కమల్ హాసన్, టి.న‌రేష్ కుమార్, టి. శ్రీధ‌ర్‌

సంగీతం : జిబ్రాన్‌

సినిమాటోగ్రఫర్ : శ్రీనివాస్ ఆర్ గుత్తా

ఎడిటర్ : ప్రవీణ్ కె ఎల్

 

చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా అక్ష‌ర‌హ‌స‌న్‌, అభిహ‌స‌న్ కీల‌క పాత్ర‌ల్లో రాజేష్ ఎం.సెల్వ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళంలో రాజ్‌క‌మ‌ల్ ఫిల్మ్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ నిర్మాణంలో ట్రైడెంట్ ఆర్ట్స్ కె.ర‌విచంద్ర‌న్ బ్యాన‌ర్ పై రూపోందిన క‌డ‌ర‌మ్ కొండాన్‌ చిత్రాన్ని తెలుగులో మిస్టర్ కె కె గానిర్మాత‌లు టి.న‌రేష్ కుమార్‌, టి. శ్రీధ‌ర్ లు సంయుక్తంగా టి.అంజ‌య్య స‌మ‌ర్ప‌ణలో నిర్మాణ సంస్థ పారిజాత మూవీ క్రియెష‌న్స్ బ్యాన‌ర్‌ పై విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ లో విక్రమ్ ని ప్రెసెంట్ చేసిన,తీరు అలాగే సినిమాని మంచిగా ప్రమోట్ చేయడంతో అంచనాలు పెరిగాయి. మరి ఈ చిత్రం ఆ అంచనాలు అందుకుందో లేదో ఇప్పుడు సమీక్షలో చూద్దాం.

కథ:

విక్రమ్ గతంలో అండర్ కవర్ కాప్ గా పని చేసిన క్రిమినల్, తన క్రిమినల్ రికార్డ్స్ ఒక చోట ఉన్నాయని చెప్పి ఓ గ్యాంగ్ అతనిని ఓ హత్య కేసులో ఇరికిస్తారు. ఆ ఆపరేషన్ లో పాల్గొన్న విక్రమ్ గాయాలపాలు కావడంతో పోలీస్ లు హాస్పిటల్ లో చేర్చడం జరుగుతుంది. ఆ హాస్పిటల్ లో పనిచేస్తున్న వాసు(అభి హాసన్) భార్య అథిరా (అక్షర హాసన్)ను కిడ్నాప్ చేసి ఓ గ్యాంగ్ విక్రమ్ ని తీసుకొచ్చి తనకు అప్పచెప్పాల్సిందిగా వాసు కి హుకుం జారీ చేస్తారు. చేయని హత్య కేసులో ఇరుకున్న విక్రమ్ ఎలా బయటపడ్డాడు, వాసు తన భార్యను ఆ గ్యాంగ్ బారి నుండి, ఎలా రక్షించుకున్నాడు అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ మూవీలో క్రిమినల్ గా మారిన ఇంటెలిజెంట్ అండర్ కవర్ కాప్ గా విక్రమ్ బాడీ లాంగ్వేజ్, నటన పాత్రకు తగ్గట్టుగా ఉన్నాయి. టాటూ బాడీతో కొన్ని సన్నివేశాల్లో ఆయన హాలీవుడ్ మూవీ హీరో భావన కలిగిస్తాడు. ఉన్న కొద్ది, యాక్షన్ సన్నివేశాల్లో విక్రమ్ ఇరగదీశాడనే చెప్పాలి.

ఇక ఈ మూవీలో విక్రమ్ తో సమానంగా స్క్రీన్ స్పేస్ పంచుకున్న అభి హాసన్ వాసు పాత్రలో చక్కగా చేశారు. గర్భవతి అయిన భార్యను కిడ్నాపర్స్ నుండి కాపాడుకొనే భర్తగా, చాలా ఎమోషనల్ సన్నివేశాలలో ఆయన నటన ఆకట్టుకుంటుంది. ఐతే విక్రమ్ ని గన్ తో బెదిరించి హాస్పిటల్ నుండి బయటకి తీసుకెళ్లే సన్నివేశంలో ఆయన నటనలో అంత తీవ్రత కనిపించదు.

ఇక ఈ మూవీ కి ప్రధాన బలం జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పేలవమైన సన్నివేశాలకు కూడా ఆయనిచ్చిన బీజీఎమ్ వాల్యూ యాడ్ చేసినట్లనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో విక్రమ్ పాత్రను ఎలివేట్ చేస్తూ వచ్చే సాంగ్ కూడా బాగుంది. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి.

కమల్ కూతురు అక్షర హాసన్ కి మొదటి సగంలో అభి హాసన్ తో నడిచే రొమాంటిక్ సన్నివేశాలు మినహా ఆమె పాత్రకు స్కోప్ ఉండకపోయినప్పటికీ, పతాక సన్నివేశాలలో సీరియస్ సీన్స్ లో యాక్టింగ్ తో ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్స్:

అసలు  కథే ఈ చిత్రానికి ప్రధానమైన బలహీనత, క్రిమినల్ యాక్టీవిటీస్ చేసే పోలీస్ గ్యాంగ్, విక్రమ్ కేసులో ఎలా ఇరికించారు,ఆయన దాని నుండి ఎలా బయటపడ్డాడు అన్న చిన్న పాయింట్ ఆధారంగా ఈ మూవీని దర్శకుడు తెరకెక్కించారు. అందరికి తెలిసిన కథని హాలీవుడ్ హంగులతో తీసి ఆకట్టుకోవాలని ప్రయత్నించారు.

క్రిమినల్ గా మరీన ఒకప్పటి అండర్ కవర్ కాప్ గా పరిచయమైన విక్రమ్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేసే ఒక్క బలమైన సన్నివేశం కూడా సినిమాలో మనకు కనిపించదు. గ్రాండ్ గా బీజీఎమ్ ప్లే అవుతుంటే విక్రమ్ మీదొచ్చే సన్నివేశాలు మాత్రం పేలవంగా సాగుతాయి.

యాక్షన్ సన్నివేశాలు కూడా ఈ మూవీకి తగినంతగా లేవు, సినిమాలో ఉన్న ఒకటి రెండు యాక్షన్ సన్నివేశాలు కూడా దాదాపు గన్ ఫైట్స్ తో ముగుస్తాయి. హీరో విక్రమ్ నుండి ఆశించే తన మార్కు యాక్షన్ సన్నివేశాలు లేకపోవడం మరొక మైనస్ అనిచెప్పాలి.

హాలీవుడ్ తరహాలో సాగే కథనం సాధారణ ప్రేక్షకుడికి అర్థం కాకపోవచ్చు. అసలు విక్రమ్ ఎవరు అనేది ఈ చిత్రంలో ఎక్కడా డిటైల్ గా చూపించలేదు. సగటు ప్రేక్షకుడికి ఇలాంటి స్క్రీన్ ప్లే అంతగా ఎక్కదు. సహజంగా మాస్ ప్రేక్షకులు ఆశించే హీరోయిన్ గ్లామర్ లేకపోవడం కూడా ఈ మూవీకి మరో బలహీనత.

సాంకేతిక విభాగం:

దర్శకుడు రాజేష్ ఎం సెల్వం తీసుకున్న కథను తెరపై ప్రెసెంట్ చేసిన తీరు పర్వాలేదు అనిపించినా, తెలిసిన కథలానే అనిపిస్తుంది. విక్రమ్ పాత్రను తెరపై ఎలివేట్ అయ్యేలా బలమైన సన్నివేశాలు రాసుకోవాల్సింది అనిపించింది. పూర్తిగా ఆయన పాశ్చాత్య ధోరణిలో మూవీ నడిపించారు.

ఈ చిత్రంలో ముందు చెప్పిన విధంగా జిబ్రాన్ అందించిన బీజీఎమ్ సినిమాకు ఎస్సెట్ అనే చెప్పాలి. ఆయన సినిమాకు తగ్గట్టుగా, హాలీవుడ్ రేంజ్ మ్యూజిక్ బిజిమ్ అందించారు. నేపథ్యంలో నడిచే పాటలు కూడా పర్వాలేదనిపిస్తాయి.

ఎడిటింగ్ చాలా బాగుంది, తక్కువ నిడివి కలిగిన ఈ మూవీలో ఒక్క సన్నివేశం కూడా అనవసరం అనే భావన కలగదు. ఫోటోగ్రఫి కూడా రిచ్ గా ఉంది, కౌలాలంపూర్ పరిసరాలను ఆయన చక్కగా బంధించి సినిమాకు రిచ్ నెస్ యాడ్ చేశారు. యాక్షన్ సన్నివేశాలలో కూడా కెమెరా పనితనం బాగుంది.

తీర్పు:

విక్రమ్ నుండి ఆశించే యాక్షన్ సన్నివేశాలు లేకుండా మొదటిసగభాగం నడిపించేసినా దర్శకుడు, రెండవ సగంలో ఒకటి రెండు సన్నివేశాలు కూడా గన్ ఫైట్ తో పైపైన లాగించేశారు. విక్రమ్ పాత్రకు తగ్గ బలమైన సన్నివేశాలు రాసుకొని, మరికొన్ని ఆసక్తి రేపే యాక్షన్ సన్నివేశాలు రాసుకొని ఉండి ఉంటే, ఈ మూవీ పరిస్థితి మరోలా ఉండేది. ఆద్యతం పాశ్చత్య ధోరణిలో సాగే ఈ మూవీ కథనం సాధారణ ప్రేక్షకుడికి కూడా నచ్చకపోవచ్చు. ఏది ఏమైనా విక్రమ్ ఈ సారి కూడా తన స్థాయి సినిమాను ప్రేక్షకులకు అందించలేదనే చెప్పాలి.

123telugu.com Rating :   2.5/5

Reviewed by 123telugu Team


Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు