సమీక్ష : మిఠాయి – రుచిలేని మిఠాయి !

Published on Feb 23, 2019 3:40 am IST
Mithai movie review

విడుదల తేదీ : ఫిబ్రవరి 22, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కమల్ కామరాజు త‌దిత‌రులు.

దర్శకత్వం : ప్రశాంత్ కుమార్

నిర్మాతలు : ప్రభాత్ కుమార్

సంగీతం : వివేక్ సాగర్

ఎడిటర్ : గారి బిహెచ్

నూతన దర్శకుడు ప్రశాంత్ కుమార్ ప్రముఖ కమెడియన్లు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకులుగా నటించిన డార్క్ కామెడీ సినిమా ‘మిఠాయి’. తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రెడ్ యాంట్స్ పతాకంపై డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

సాయి (రాహుల్ రామకృష్ణ), జానీ (ప్రియదర్శి) చిన్నప్పటినుంచీ మంచి ఫ్రెండ్స్. ఏ పని చెయ్యకుండా జానీ, సాయితో తిని తిరిగుతుంటాడు. మరోవైపు పెళ్లి చేసుకోవటానికి ఏర్పాట్లు చేసుకుంటున్న సాయికి ఉన్న జాబ్ కూడా పోతుంది. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం సాయి తనకు కాబోయే భార్య కోసం కొన్న విలువైన చెయిన్ ను ఎవరో దొంగిలిస్తారు. ఆ తరువాత జరిగిన ఓ అవమానం కారణంగా ఆ దొంగను పట్టుకున్న తరువాతనే నేను పెళ్లి చేసుకుంటానని సాయి ఛాలెంజ్ చేస్తాడు. మరి సాయి ఆ దొంగను పట్టుకున్నాడా ? లేదా ? సాయి పట్టుకోవడానికి జానీ ఎలాంటి సహాయ సహకారాలు అందించాడు ? చివరికి సాయి పెళ్లి అవుతుందా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన ప్రముఖ కమెడియన్లు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలే ఈ సినిమాకు ప్రధాన బలం. సినిమాలో అక్కడక్కడ కొన్ని కామెడీ ఎలిమెంట్స్ పర్వాలేదని అనిపించాయంటే.. దానికి రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటనే కారణం. తమ పాత్రలకు తగ్గట్లు… తమ రియలిస్టిక్ యాక్టింగ్ తో మాడ్యులేషన్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచారు.

అలాగే కమల్ కామరాజు ట్రాక్ కూడా సినిమాలో కొంత ఇంట్రస్ట్ ను పెంచడానికి ఉపయోగపడింది. ఇక ఈ సినిమాలో తానూ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి అసలు నిజం తెలిసే సన్నివేశంలో రాహుల్ రామకృష్ణ నటన చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో నటించిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు ప్రశాంత్ కుమార్ రాసుకున్న కొన్ని సీన్స్ పర్వాలేదనిపించినప్పటికీ.. కథ కథనాల్లో మాత్రం ప్లో మిస్ అయింది. ముఖ్యంగా ఆయన రాసుకున్న కథనం ఆకట్టుకొన్నే విధంగా లేదు. దీనికి తోడు సెకెండ్ హాఫ్ స్లోగా సాగుతూ బాగా బోర్ కొట్టిస్తుంది.

దర్శకుడు సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తరువాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశారనిపిస్తోంది. అనవసరమైన సన్నివేశాలు అలాగే అనవసరమైన సాంగ్స్ కూడా ఎక్కువైపోయాయి. పైగా సీన్స్ అన్ని కూడా.. ఒకేలా సాగడం కూడా విసుగు తెప్పిస్తోంది. ఈ రిపీట్ డ్ సీన్స్ మరీ ఎక్కువడంతో సినిమా ఫలితమే దెబ్బ తింది.

అసలు కథలోని మెయిన్ ప్లాట్ కి దారి తీసే.. మెయిన్ ప్లాట్ పాయింట్ కూడా చాలా పేలవంగా ఉంది. దానికి తోడూ లాజిక్స్ లేని సీన్స్ తో పండని కామెడీతో విసిగిస్తా32డు. మొత్తానికి దర్శకుడు కథా కథనాలన్ని ఆసక్తికరంగా మలచకపోగా.. ఉన్న కంటెంట్ ను కూడా బాగా ఎలివేట్ చేయలేకపోయారు. ఆయన స్క్రిప్ట్ పై బాగా శ్రద్ధ పెట్టి ఉండి ఉంటే బాగుండేది.

 

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ గా నిలుస్తోంది.

ఇక ఎడిటింగ్ బాగుంది గాని, సెకండాఫ్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఇక నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లే ఉన్నాయి.

 

తీర్పు :

ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కథానాయకులుగా వచ్చిన ఈ డార్క్ కామెడీ సినిమా ఆకట్టుకునే విధంగా సాగలేదు. సినిమా ప్రారంభంలో కొన్ని కామెడీ సీన్స్ తో పాటు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కామెడీ టైమింగ్ బాగున్నప్పటికీ.. ఓవరాల్ గా సినిమా మాత్రం స్లోగా సాగుతూ బాగా బోర్ కొట్టిస్తుంది. పైగా సెకండాఫ్ లో సాగతీత సన్నివేశాలు విసుగు తెప్పిస్తాయి. మొత్తం మీద ఈ ‘మిఠాయి’ బాగా నిరాశ పరుస్తోంది.

 

Click here for English Review

 

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

సంబంధిత సమాచారం :