సమీక్ష : యాత్ర – వైఎస్సార్ ఎమోషనల్ జర్నీ !

సమీక్ష : యాత్ర – వైఎస్సార్ ఎమోషనల్ జర్నీ !

Published on Feb 9, 2019 2:21 AM IST
Yatra movie review

విడుదల తేదీ : ఫిబ్రవరి 08, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

నటీనటులు : మమ్ముట్టి, జగపతిబాబు, సుహాసిని, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్ తదితరులు.

దర్శకత్వం : మహి.వి.రాఘవ్

నిర్మాతలు : విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డి

సంగీతం : కృష్ణ కుమార్

సినిమాటోగ్రఫర్ : సత్యన్ సూర్యన్

ఎడిటర్ : ఎ. శ్రీకర్ ప్రసాద్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వై.యస్. రాజశేఖరరెడ్డిగారు 2004 ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా చేసిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ పేరుతో మహి.వి.రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించారు. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో ఒకసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

అధిష్టానానితో సంబంధం లేకుండా, పేదల క‌ష్టాల్ని విన‌టానికి.. క‌డ‌ప గ‌డ‌ప దాటి పాద‌యాత్రను ప్రజా యాత్రగా మార్చిన మ‌హ‌నేత‌ వైఎస్సార్ (మమ్ముట్టి) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజులు అవి. ఇక అప్పటి పరిస్ధితుల దృష్ట్యా 2004 ఎన్నికలు సంవత్సరానికి ముందే వస్తాయి. దాంతో వైఎస్ ప్రాతినిధ్యం వహిస్తోన్న కాంగ్రెస్ పార్టీ ఇక గెలిచే అవకాశం లేదని సర్వేలతో పాటు, అప్పటి నాయకులు కూడా బలంగా నమ్ముతారు.

అలంటి సమయంలో కొన్ని సంఘటనల ప్రభావంతో వైఎస్సార్ పాదయాత్రను మొదలు పెడతారు. ఆ యాత్ర ప్రయాణంలో వైఎస్సార్ కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ? ప్రజలు అప్పుడు ఏఏ సమస్యలతో బాధ పడుతున్నారు ? ఆ సమస్యల పరిష్కారలకు ఆయన ఎలా స్పందించారు ? చివరకి ప్రజల గుండెల్లో కొలిచే మహానేతగా ఆయన ఎలా ఎదగగలిగారు ? 2004 ఎన్నికల్లో పార్టీని ఎలా గెలిపించగలిగారు ? ఈ క్రమంలో వైఎస్సార్ ఎదురుకున్న ఇబ్బందులు, అనుభవాలు ఏమిటి ? ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

పేదవాడి బాధలను తీర్చడానికి రైతుల కన్నీళ్లను తుడవడానికి క‌డ‌ప దాటి పాదయాత్ర పేరుతో ప్ర‌తి గ‌డ‌ప‌లోకి వెళ్లారు దివంగ‌త నేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిగారు. నిజానికి వైఎస్సార్ రాజ‌కీయ జీవితంలో ‘పాదయాత్ర’ ఎంతో కీల‌క‌మైనది. అలాగే తెలుగు రాజకీయాల పై కూడా తీవ్ర ప్రభావం చూపింది వైఎస్సార్ పాదయాత్ర. కాగా పాదయాత్ర చేస్తోన్న సమయంలో వైఎస్సార్ చూసిన సంఘటనలను, అలాగే ఆయనకు ఎదురైన అనుభవాలను మహి.వి.రాఘవ్ కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశారు.

ఇక మమ్ముట్టి నటన గురించి కొత్తగా చెప్పాలా.. వైఎస్సార్ పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. ముఖ్యంగా వైఎస్సార్ పాత్రలోని సోల్ ని, ఎమోషన్ని పట్టుకొని.. తన నటనలో తన ఎక్స్ ప్రెషన్స్ లో మమ్ముట్టి చూపించిన విధానం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఆలాగే రైతుల క‌ష్టాలు, పేద‌వాళ్ళ ఆవేద‌న‌లకు సంబంధించిన సన్నివేశాలు మరియి వైఎస్సార్ కేవీపీల సేహ్నం ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాలు, క్లైమాక్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తాయి. మొత్తానికి మంచి ఎమోష‌న‌ల్ కంటెంట్‌ తో దర్శకుడు ప్ర‌తి ప్రేక్ష‌కుడి గుండెను టచ్ చేస్తాడు.

వీటికి తోడు “నీళ్ళుంటే క‌రెంటు వుండ‌దు.. క‌రెంటు వుంటే నీళ్ళుండ‌వు..రెండూ ఉండి పంట చేతికొస్తే స‌రైన ధ‌ర వుండ‌దు. అంద‌రూ రైతే రాజంటారు..స‌రైన కూడు గూడు గుడ్డ నీడ లేని ఈ రాచ‌రికం మాకొద్ద‌య్య‌.. మ‌మ్మ‌ల్ని రాజులుగా కాదు క‌నీసం రైతులుగా బతకనివ్వండి’ అలాగే “నేను విన్నాను నేను వున్నాను’ లాంటి డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటాయి.

ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే.. కేవీపీ పాత్రలో నటించిన రావు రమేష్, రాజా రెడ్డిగా కనిపించిన జగపతి బాబు, సబితా ఇంద్రారెడ్డిగా నటించిన సుహాసిని తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మరో ముఖ్య పాత్రలో కనిపించి పోసాని కూడా తన నటనతో ఆకట్టుకుంటాడు. అలాగే ఇతర పాత్రల్లో కనటించిన నటీనటులు కూడా తమ నటనతో మెప్పిస్తారు.

 

మైనస్ పాయింట్స్ :

అదిష్టానాన్ని సైతం లెక్క‌చేయ‌కుండా పాద‌యాత్రను ప్రారంభించిన జ‌న‌నేత‌గా, మ‌హ‌నేత‌ వైఎస్ పాద‌యాత్రకు సంబంధించి చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు, ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు. ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ ఆయన మాత్రం వాట్ని సింపుల్ గా నడిపారు.

మంచి ఎమోషనల్ గా సినిమాని నడిపిన మహి, అక్కడక్కడ కొన్ని సీన్స్ లో ఆ ఎమోషన్ని ఆ స్థాయిలోనే కంటిన్యూ చేయలేక పోయాడు. పైగా ఓవర్ గా సినిమాటిక్ శైలిని ఎక్స్ పెక్ట్ చేసి వెళ్లితే మాత్రం నిరాశ తప్పదు. ఇక ఎలాంటి రెగ్యూలర్ కమర్షియల్ అంశాలు పెట్టకుండా దర్శకుడు తను అనుకున్న ఎమోషనల్ డ్రామానే ఎలివేట్ చేయటానికే ఆసక్తి చూపారు.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. మహి.వి.రాఘవ్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన ఎమోషనల్ సన్నివేశాలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.

సంగీత దర్శకుడు ‘కె’ సమకూర్చిన పాటలు, వాటి పిక్చరైజేషన్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా రైతు పాట చెప్పుకోతగ్గ పాటగా నిలిచిపోతుంది. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. సినిమాలోని సన్నివేశాలన్నీ ఆయన కథకి అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ కూడా బాగుంది.. నిర్మాతలు విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ళ నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

తీర్పు :

ముందుగానే చెప్పుకున్నట్లు పేదవాడి బాధలను వినడానికి, రైతుల కన్నీళ్లను తుడవడానికి క‌డ‌ప దాటి పాదయాత్ర పేరుతో ప్ర‌తి గ‌డ‌ప‌లోకి వెళ్లారు దివంగ‌త నేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిగారు. ఆయన రాజ‌కీయ జీవితంలో ‘పాదయాత్ర’ ఎంతో కీల‌క‌మైనది. అలాంటి పాదయాత్ర థీమ్ బేస్ చేసుకొని దర్శకుడు మహి.వి.రాఘవ్ రాసిన కథతో పాటు బలమైన పాత్రలతో మరియు పెయిన్ ఫుల్ ఎమోషనల్ సన్నివేశాలతో ఆకట్టుకున్నారు. దీనికి తోడు మమ్ముట్టి కూడా తన నటనతో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. మొత్తం మీద ఈ చిత్రం వైఎస్సార్ అభిమానులకు మాత్రం ఎప్పటికీ గుర్తు ఉండిపోతుంది. అలాగే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని కూడా ఈ చిత్రం అలరిస్తుంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో ఈ చిత్రం నిలబడుతుందో చూడాలి.

123telugu.com Rating : 3.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు