అంగరంగ వైభవంగా మోహన్ బాబు 40 వసంతాల సినీ వేడుక!

mohanbabu
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా నటుడిగా, నిర్మాతగా మాత్రమే కాక విద్యా సంస్థల అధిపతిగా అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాకు, విద్యా రంగానికి ఎన్నో సేవలందించిన ఆయన ఇంతటి స్థాయికి రావడానికి మొదటి బీజం సినీ రంగంలోనే పడింది. ఇక ఆయన సినీ రంగంలోకి ప్రవేశించి 40 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఇప్పటికే ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ పలు చిన్న చిన్న కార్యక్రమాలు నిర్వహించగా, ఈ సాయంత్రం 40 వసంతాల వేడుక ఒకటి వైజాగ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.

మోహన్ బాబు సినీ ప్రస్థానం గురించి ప్రస్తావిస్తూ ఆయన నట ప్రయాణానికి గుర్తుగా ఈ వేడుకను వ్యాపార, రాజకీయవేత్త టి.సుబ్బిరామిరెడ్డి నిర్వహించారు. చిరంజీవి, వెంకటేష్, శ్రీదేవి లాంటి టాప్ స్టార్స్ ఈ వేడుకకు అతిథులుగా హాజరై మోహన్ బాబుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదే వేడుకలో మోహన్ బాబు సినిమాల్లోని టాప్ సాంగ్స్‌కు సంబంధించిన సీడీతో పాటు ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ ‘పెదరాయుడు’ సినిమాకు సంబంధించిన పుస్తకాన్ని కూడా విడుదల చేశారు.