వసూళ్ళ వర్షం కురిపిస్తోన్న ‘ఎం.ఎస్.ధోని’!
Published on Oct 2, 2016 7:52 pm IST

ms-dhoni
క్రికెట్‌కు కొత్త కళ తీసుకొచ్చి, ఇండియాకు క్రికెట్‌లో తిరుగులేని విజయాలను అందించిన ఎం.ఎస్.ధోని జీవిత కథ ఆధారంగా ఎం.ఎస్.ధోని అన్న సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండే తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున గత శుక్రవారం విడుదలైంది. ఇక విడుదలకు ముందు నుంచే తారాస్థాయి అంచనాలను మూటగట్టుకున్న ఈ సినిమాకు విడుదల తర్వాత కూడా అదిరిపోయే టాక్ రావడంతో అంతటా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురుస్తోంది.

విడుదలైన అన్ని భాషల్లోనూ సినిమా మంచి వసూళ్ళు రాబడుతోంది. శుక్ర, శనివారాలు రెండు రోజులు కలుపుకొని దేశవ్యాప్తంగా ఈ సినిమా 41 కోట్ల రూపాయల వసూళ్ళు రాబట్టింది. ఆదివారంతో సినిమా 60 కోట్ల మార్క్ దాటేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. బాలీవుడ్‌లో హీరోగా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటోన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ధోని పాత్రలో అద్భుతంగా నటించి టాప్ స్టార్స్ జాబితాలో చేరిపోయారు. ఇక రానున్న రోజుల్లో దసరా సెలవుల దృష్ట్యా ఎం.ఎస్.ధోని బాక్సాఫీస్ వద్ద ప్రభంజనమే సృష్టించే అవకాశం కనిపిస్తోంది.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook