హ్యాట్రిక్ హిట్‌పై కన్నేసిన హిట్ కాంబినేషన్!

damodar-and-nandini
‘అలా మొదలైంది’ పేరుతో సరిగ్గా ఐదేళ్ళ క్రిందట ఒక చిన్న సినిమా చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఒక కొత్తదనమున్న అర్బన్ ప్రేమకథను కట్టిపడేసే స్క్రీన్‌ప్లేతో దర్శకురాలిగా పరిచయమవుతూ ఆ సినిమాను తెరకెక్కించిన నందిని రెడ్డి, అప్పట్లో తెలుగులో సంచలనం సృష్టించారు. రంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్.దామోదర్ రెడ్డి నిర్మించిన ఆ సినిమా ఆయనకు కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఈ దర్శక, నిర్మాతల కాంబినేషన్‌లో మళ్ళీ ఐదేళ్ళకు కళ్యాణ వైభోగమే పేరుతో మరో అందమైన ఫ్యామిలీ డ్రామా వచ్చి హిట్ కొట్టింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది.

ఈ సందర్భంగా నిర్మాత దామోదర్ ప్రసాద్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, తనదీ, నందిని రెడ్డిది మ్యాజిక్ కాంబినేషన్ అనీ, తమ కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా కూడా ఇంతపెద్ద విజయం సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇక త్వరలోనే తన సంస్థలో నందిని రెడ్డి దర్శకురాలిగా ఓ సినిమా తెరకెక్కనుందని, ఆ సినిమాతో తమ కాంబినేషన్ హ్యాట్రిక్ కొడుతుందని ఆయన అన్నారు. ఇద్దరి ఆలోచనా విధానం ఒకేలా ఉండడంతో దామోదర్ గారితో పనిచేయడం చాలా బాగుంటుందని, తమ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమా వస్తుందని నందిని రెడ్డి తెలిపారు. నాగ శౌర్య, మాళవిక నాయర్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ‘కళ్యాణ వైభోగమే’ సినిమా నందిని రెడ్డికి పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టిందనే చెప్పాలి.

Exit mobile version