నేచురల్ స్టార్ నాని, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఏషనాగుల’ ఫోక్ సాంగ్ శ్రోతల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ క్రమంలో ఈ పాటకు సంబంధించి వీరిద్దరూ కలిసి చేసిన ఓ సరదా వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
అమెరికా పర్యటనలో ఉన్న నాని, అనిరుధ్ న్యూయార్క్‌లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ వద్ద లైట్లతో అలంకరించిన రిక్షా (పెడిక్యాబ్)లో సందడి చేశారు. ఈ క్రమంలో ‘ది ప్యారడైజ్’ చిత్రంలోని ‘ఏషనాగుల’ పాట బీట్‌కు అనుగుణంగా ఇద్దరూ చేతులతో దరువు వేస్తూ పక్కా లోకల్ స్టైల్‌లో ఎంజాయ్ చేశారు.
“లొకేషన్: ఇంటర్నేషనల్.. ఎమోషన్: లోకల్” అనే క్యాప్షన్‌తో అనిరుధ్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అంతర్జాతీయ వేదికైన టైమ్స్ స్క్వేర్ వీధుల్లో మన నేటివ్ ఫోక్ బీట్‌కు నాని, అనిరుధ్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులతో పాటు సినీ ప్రముఖులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.


