
‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్ సూర్య’ లాంటి మూడు కొత్తదనమున్న సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్నాడు యువహీరో నిఖిల్. మూడు వరుస విజయాల తర్వాత ఈ కోవలో తన కొత్త సినిమానూ చాలా కొత్తగా ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే! కోనవెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ‘శంకరాభరణం’ అన్న టైటిల్ పెట్టి బీహార్ నేపథ్యంలో క్రైం కామెడీ సినిమా తెరకెక్కిస్తున్నారన్న వార్త రాగానే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పకడ్బందీగా జరుగుతున్నాయి. స్క్రిప్ట్ పనులు దాదాపుగా పూర్తైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా యూనిట్ లొకేషన్ల వేటలో పడింది. బీహార్ నేపథ్యంలో తెరకెక్కనున్న క్రైం కామెడీ కావడంతో ఈ సినిమా కోసం ఎక్కువగా నార్త్ ఇండియాలోని అద్భుతమైన లొకేషన్ల కోసం వెతుకుతున్నారు.
ఇక గత కొద్ది రోజులుగా హీరో నిఖిల్ అమెరికాలో తన వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ వెకేషన్‌ను పూర్తి చేసుకొని హైద్రాబాద్ వచ్చేశాడు. రావడంతోనే ప్రీ ప్రొడక్షన్ చర్చల్లో పాల్గొనేందుకు సిద్ధమైపోయారు. తన పాత్రపై కొంత హోమ్‌వర్క్ చేసే పనిలో నిఖిల్ ఉన్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ద్వారా ఉదయ్ నందనవనం అనే కొత్త దర్శకుడు సినీ పరిశ్రమకు పరిచయం కానున్నాడు.

