
తెరపైనే కాదు నిజ జీవితంలోనూ తాను మానవతావాదినని యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి ఋజువు చేశారు. అభిమానులే తనకు దేవుళ్ళని చెప్పే ఎన్టీఅర్ తాజాగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోన్న తన అభిమాని కోరిక నెరవేర్చారు. శ్రీనిధి అనే పేరుగల ఓ పదేళ్ళ పాప గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. ప్రస్తుతం శ్రీనిధి కూకట్‌పల్లిలోని రాందేవ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. క్యాన్సర్ చివరిదశకు చేరిందన్న విషయాన్ని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. శ్రీనిధిని రక్షించడానికి హాస్పిటల్ వర్గాలు అన్ని విధాలా శ్రమిస్తున్నాయి. ఇదిలా ఉంటే చికిత్స పొందుతోన్న ఆ చిన్నారి, తాను ఎంతగానో ఇష్టపడే హీరో ఎన్టీఆర్‌ను కలవాలన్న ఓ కోరికను బయటపెట్టింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఎన్టీఆర్, ఆ చిన్నారిని కలిసేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఉదయం పదకొడు గంటలకు ఎన్టీఆర్ రామ్‌దేవ్ హాస్పిటల్‌లో శ్రీనిధిని కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనిధి కుటుంబ సభ్యులను ధైర్యంగా ఉండమని ఆయన కోరారు. శ్రీనిధి వైద్యం కోసం ఎలాంటి సహాయం కావాలన్న తనను సంప్రదించమని ఎన్టీఆర్ కోరారు. ఇక శ్రీనిధిని కలిసిన తర్వాత ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. “ఇలాంటి బాధ ఎవ్వరికీ రాకూడదు. నాకూ ఓ కొడుకున్నాడు. శ్రీనిధి పరిస్థితి చూసి ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకోగలను. నన్ను కలవడం ద్వారా ఆ పాప సంతోషంగా ఉంటుందంటే అంతకంటే ఏం కావాలి? ఆ పాపకు తన పరిస్థితి గురించి తెలియదు. నన్ను చూసి చాలా సంతోషించింది. అదే సంతోషంతో క్యాన్సర్‌ను జయించి మనముందు నవ్వుతూ తిరగాలని అందరం ఆ దేవుణ్ణి కోరుకుందాం” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు ఎన్టీఆర్.

