ఇంటర్వ్యూ : ఓంకార్ – ఆయనతో పనిచేయడం నా కల !

Published on Oct 17, 2019 3:38 pm IST

‘రాజాగారు గది’ ప్రాంచైజీలో వస్తున్న మూడవ చిత్రం ‘రాజుగారి గది 3’. హారర్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 18న విడుదల కానుంది. అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రలలో నటించగా, ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కింది. మూవీ విడుదల నేపథ్యంలో ఓంకార్ సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలు పంచుకున్నారు.

‘రాజుగారి గది 2’ స్టార్ క్యాస్ట్ తో చేశారు, మరి మూడో పార్ట్ ను ఎందుకు స్టార్స్ తో చెయ్యలేకపోయారు ? ఓ మెట్టు దిగారేమో ?

అలా ఎందుకు చేశామో రేపు ఈ మూవీ విడుదలయ్యాక మీరే చెబుతారు, ఒకమెట్టు దిగడం కాదు.. మూడు మెట్లు పైకెక్కామని మీరే అంటారు. ఈ సినిమా అవుట్ ఫుట్ అంత బాగా వచ్చింది. ఇక ఈ కథకు స్టార్ క్యాస్ట్ అవసరం లేదు. స్క్రిప్ట్ కి అనుగుణంగానే ఆర్టిస్ట్ లను తీసుకున్నాం.

 

అశ్విన్ ను కథను అనుగుణంగానే ఎంపిక చేశారా ?

అవును. కథకు అనుకూలంగా పాత్రలు తీసుకుంటాం కానీ, మా తమ్ముడు అశ్విన్ హీరోని చేద్దాం అని ఈ మూవీలో తనను తీసుకోలేదు. రాజుగారి గది మూవీకి అశ్విన్ సరిపోతాడని నా తమ్ముడ్ని తీసుకోవడం జరిగింది. అయితే తమ్ముడ్ని హీరోని చేయాలనే కోరిక మాత్రం ఈ మూవీతో తీరుతుంది.

 

‘రాజుగారి గది 2’ తరువాత పెద్ద హీరోలెవరూ ఈ సిరీస్ లో చేయడానికి ఇష్టపడలేదని వార్తలు వచ్చాయి ?

వాటిల్లో నిజం లేదండి. ‘రాజుగారి గది 2’ తరువాత నేను వెంకీ సర్ తో ఓ మూవీ చేయాల్సివుంది. అసలు ‘రాజుగారి గది 2’ ఆయనతోనే చేయాల్సింది. కానీ ఆయన రెండు మూడు చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ అడ్జస్ట్ కాలేదు. ఆ టైంలో నేను కూడా ఇటు సినిమాలతో పాటు, అటు టీవీ ప్రోగ్రామ్స్ కూడా బ్యాలన్స్ చేయాల్సిన పరిస్థితి, అందుకే కుదరలేదు. కానీ వెంకీ గారితో మాత్రం ఖచ్చితంగా సినిమా చేస్తాను. ఆయనతో చేయడం నా కల.

 

ఇప్పుడు వస్తున్న హారర్ సినిమాలలో మీరు గమనించిన మార్పు ఏమిటి?

‘రాజుగారి గది’ వచ్చిన టైంలో హారర్ కామెడీ చిత్రాలు చాలా తక్కువగా వచ్చేవి. కానీ, ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. ఒక నెలలోనే మూడు, నాలుగు సినిమాలు ఈ జోనర్ లో విడుదల అవుతున్నాయి. అయితే ఆడియన్స్ కి కావాల్సింది ఎంటర్టైన్మెంట్. అది హారర్ మూవీనా, మరో మూవీనా అన్నది ముఖ్యం కాదు. వాళ్ళకి నచ్చితే ఆ సినిమాని ఆదరిస్తారు.

 

ఈ హారర్ సినిమాలో ప్రేక్షకులను బాగా కట్టుకునే అంశాలు ఏమిటి ?

ఈ సినిమాలో కామెడీ అద్భుతంగా ఉంటుంది. సినిమా చూస్తూ ఉన్నంత సేపూ కామెడీని మనం ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. అలాగే సినిమాలో డైలాగ్స్ అండ్ మ్యూజిక్ ఇలా అన్ని బాగుంటాయి. ఒక్కమాటలో ప్రేక్షకులకు కావలసిన అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ మూవీతో ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటాం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

ఈ మూవీతో అశ్విన్ కి హీరో ఇమేజ్ వస్తుందని అనుకుంటున్నారా ?

అశ్విన్ ఇంత వరకు ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ, ఈ మూవీ తరువాత తనని ఖచ్చితంగా హీరో మెటీరియల్ గా గుర్తిస్తారు. అయితే ఏ రవితేజ లాంటి ఇమేజో లేక పవన్ కళ్యాణ్ లాంటి ఇమేజో వచ్చేస్తోంది అని నేను చెప్పట్లేదు. కానీ ఒక మంచి హీరోగా అశ్విన్ ఈ సినిమాతో గుర్తింపు తెచుకుంటాడనే నమ్మకం ఉంది.

 

మీ తదుపరి సినిమాలు ఏమిటి ?

కొన్ని కథలు అయితే ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి నా దృష్టి అంతా ‘రాజుగారి గది 3’ విడుదల పైనే ఉంది.

సంబంధిత సమాచారం :

X
More