
ఎనర్జిటిక్ హీరో రామ్ చేస్తోన్న తాజా సినిమా ‘పండగ చేస్కో’ విడుదలకు సిద్ధమౌతోంది. ‘బలుపు’ లాంటి మంచి హిట్ ఇచ్చిన గోపిచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కించారు. థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో ఈ మధ్యే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ముఖ్యంగా ‘యూ మై డార్లింగ్’ అనే పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక థియేట్రికల్ ట్రైలర్‌కైతే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఔట్ అండ్ ఔడ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరిదశకు చేరుకున్నాయి.
భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా మే మొదటి వారంలోనే విడుదలవుతుందనే ప్రచారం జరిగినా కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా మే నెలాఖరుకు షిఫ్టైంది. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం మేరకు నిర్మాత మే 29న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని పండగ చేస్కో రచయిత కోన వెంకట్ కూడా తెలియజేశారు. రామ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను పరుచూరి కిరీటి నిర్మించారు.

