సమీక్ష : పూజ – మాస్ ప్రేక్షకులకి మాత్రమే ఇది ‘పూజ’.!

Published on Oct 23, 2014 12:00 am IST
pooja-movie-review విడుదల తేదీ : 22 అక్టోబర్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : హరి
నిర్మాత : విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
సంగీతం : యువన్ శంకర్ రాజా
నటీనటులు : విశాల్, శృతి హాసన్, సత్యరాజ్…


స్వతహాగా తెలుగువాడైనా తమిళం హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో విశాల్. మొదటి నుంచి ఎక్కువ యాక్షన్ ఎంటర్టైనర్స్ చేస్తూ యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్ నటించిన మరో మాస్ ఎంటర్టైనర్ ‘పూజ’. గతంలో వచ్చిన ‘యముడు’, ‘సింగం’ సినిమాలతో మాస్ చిత్రాల స్పెషలిస్ట్ గా పేర్చు తెచ్చుకున్న హరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అందాల భామ శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. పూర్తి మాస్ ఎంటర్టైనర్ అయిన ఈ సినిమాలో సత్య రాజ్ ఓ కీలక పాత్ర పోషించాడు. గతంలో విశాల్ – హరి కాంబినేషన్ లో వచ్చిన ‘భరణి’ సినిమా మంచి హిట్ అయ్యింది. ఈ సినిమా కూడా అదేలా హిట్ అవుతుందని విశాల్ ఆశిస్తున్నాడు. మరి విశాల్ అనుకున్నట్టు పూజ కమర్షియల్ గా ఏ మేరకు ఆడియన్స్ ని మెప్పించిందో ఇప్పుడు చూద్దాం..

కథ :

ఈ సినిమా కథ బొబ్బిలి ప్రాంతంలో మొదలవుతుంది. చిన్నప్పుడే బొబ్బిలి నుంచి పారిపోయి బీహార్ లో గుండాగా దందాలు చేసి మళ్ళీ బొబ్బిలి తిరిగి వచ్చిన సింగన్న పాత్రుడు (ముఖేష్ అద్వానీ) బొబ్బిలిలో అన్నం ఫైనాన్స్ కంపెనీని పెట్టి దాని ముసుగులో కాంట్రాక్ట్ మర్డర్స్ చేస్తుంటాడు. అదే ఊరిలో ఓ మార్కెట్ యార్డులో వాసు(విశాల్) వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అనుకోకుండా కలిసిన దివ్య(శృతి హాసన్) తో వాసు ప్రేమలో పడతాడు. ఇదిలా ఉండగా వైజాగ్ కి వచ్చిన ఎస్.పి శివరాం నాయక్(సత్యరాజ్)ని సింగన్న చంపడానికి ప్లాన్ చేస్తాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న వాసు శివరాం నాయక్ ని కాపాడతాడు.

అదే సమయంలో ఓ కారణంగా సింగన్న బొబ్బిలి ప్రాంతానికి చెందిన జికె గ్రూప్కంపెనీ ఓనర్స్ అయిన రాధిక ఫ్యామిలీని టార్గెట్ చేస్తారు. కానీ అదే ఫ్యామిలీకి చెందిన వాసు తన ఫ్యామిలీ ఆపదలో ఉందని తెలియడంతో రంగంలోకి దిగుతాడు. అసలు సింగన్నకి – రాధిక ఫ్యామిలీకి ఉన్న వైరం ఏమిటి.? ఏ కారణం చేత సింగన్న వాసు ఫ్యామిలీని చంపాలనుకుంటాడు.? అసలు తనకంటూ ఓ ఫ్యామిలీ ఉన్నా వాసు వారందరికీ ఎందుకు దూరంగా ఉన్నాడు.? సింగన్నకి జయరాం విషయంలో తనకు కావాల్సింది మరియు జికె ఫ్యామిలీని కాపాడుతున్నది వాసు అని తెలియగానే ఏం చేసాడు? అన్నది మీరు వెండితెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

‘పూజ’ అనేది విశాల్ – హరి కాంబినేషన్ లో వచ్చిన మరో మాస్ ఎంటర్టైనర్.మాస్ ఎంటర్టైనర్స్ చేయడం విశాల్ కి కొత్తేమీ కాదు.. కావున విశాల్ ఈ సినిమా చేయడం మొదటి ప్లస్ పాయింట్. ఇక విశాల్ నటన విషయానికి వస్తే.. ఇలాంటి సినిమాలు విశాల్ బోలెడు సినిమాలు చేసాడు కాబట్టి ఇందులో నటన పరంగా కొత్తగా చూపించిన వైవిధ్యం ఏమీ లేదు. ఎప్పటిలానే ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాడు. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగా చేసాడు. ఇక చెప్పుకోవాల్సింది సినిమాకి ఉన్న గ్లామర్ అట్రాక్షన్ శృతి హాసన్ గురించి.. ఇప్పుడు అందరు హీరోయిన్స్ చేస్తున్న గ్లామర్ పాత్రే శృతి హాసన్ ఇందులో కూడా చేసింది. నటనకి మరియు ఎక్కువ సీన్స్ లో చాన్స్ లేని శృతి హాసన్ ఉన్నంతలో తన గ్లామర్ తో మాత్రం ఆడియన్స్ ని పూర్తిగా తనవైపు తిప్పుకుంది. ముఖ్యంగా దేవత, ఇట్టాగనే సాంగ్స్ లో బాగా అందాలు ఒలికించి అందరినీ ఆకట్టుకుంది.

పోలీస్ ఆఫీసర్ పాత్రలో సత్యరాజ్ పెర్ఫార్మన్స్ డీసెంట్ గా ఉంది. అలాగే విలన్ పాత్ర చేసిన ముఖేష్ అద్వానీ తన వరకూ ఇచ్చిన పాత్రకి న్యాయం చేసాడు. ఇక చాలా రోజుల తర్వాత తెరపై కనిపించిన రాధిక పాత్ర చిన్నదైనా ఉన్నంతలో బాగా చేసింది. తమిళ కమెడియన్ సూరి చేసిన కామెడీ సీన్స్ కొన్ని చోట్ల ఆడియన్స్ నవ్విస్తాయి. హరి సినిమా అంటే సినిమా అంతా ఒకే రేంజ్ ఊపు ఉండకపోయినా అక్కడక్కడా మాత్రం డమాల్ డుమీల్ అంటూ సినిమా పరిగెడుతుంది. అదే విధంగా ఈ సినిమాలో కూడా కొన్ని ఎపిసోడ్స్ ఆడియన్స్ ని మెప్పిస్తాయి. ముఖ్యంగా ఇంటర్వల్ బ్లాక్, సెకండాఫ్ లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు చాలా బాగా తీసారు. మొదట్లో వచ్చే ఆండ్రియా స్పెషల్ సాంగ్ ముందు బెంచ్ వారిని బాగానే ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్ లో చెప్పాల్సింది సెకండాఫ్. అలా అని ఫస్ట్ హాఫ్ఫెంటాస్టిక్ అని కాదు. ఇప్పుడు కాస్త క్లియర్ గా చెబుతా.. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. సరే ఏదో చిన్న చిన్న కామెడీ సీన్స్, శృతి హాసన్ – విశాల్ ట్రాక్ తో కొద్ది సేపు లాక్కొచ్చారు. ప్రీ ఇంటర్వల్ బ్లాక్ ముందు అసలు కథలోకి ఎంటర్ అయ్యి ఇంటర్వల్ కార్డు టైంకి సినిమాని పూర్తి చేసేసారు. ఆ తర్వాత 10 నిమిషాల్లో అయిపోవాల్సిన పాయింట్ పట్టుకొని ఆ 10 నిమిషాలకి, మరో గంట టైంని జోడించి సెకండాఫ్ ని సాగదీశారు. ఆ సాగదీసిన దానిలో ఏమేమి జరుగుతుందా అనేది ఆడియన్స్ 1990 టైం నుంచి వస్తున్న సినిమాల్లో చూస్తూనే ఉన్నారు. కావున ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండాఫ్ పెద్ద మైనస్.

ఇక ఓ రివెంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటే విలన్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండాలి, అలాగే హీరోయిజంకి దీటుగా నిలిచేలా ఉండాలి. కానీ డైరెక్టర్ హీరోకి తగ్గట్టుగా విలన్ పాత్రని రాసుకోలేదు. చూస్తున్న ఆడియన్స్ లో విలన్ ఏంటి హీరోకి గట్టి పోటీ ఇవ్వడం లేదు అనిపిస్తుంది. అలా ఫీలయ్యారు అంటే హీరోయిజం ఎంత చూపినా వృధా ప్రయాసే అవుతుంది. అలాగే పోలీస్ పాత్రలో సత్యరాజ్ లాంటి నటున్ని తీసుకున్నారు సరే.. కానీ ఆ పోలీస్ పాత్రకి సరైన ప్రాధాన్యత ఉండాలి అనే చిన్న లాజిక్ ని హరి ఎలా మిస్సయ్యాడో.. ఎందుకంటే సత్యరాజ్ లాంటి స్టార్ యాక్టర్ ని పెట్టుకున్నప్పుడు ఆ పాత్రకి ప్రాధాన్యత లేకపోతే ఆడియన్స్ ఆ పాత్రకి కనెక్ట్ కారు.

ఇక సినిమాలో ఒకటి రెండు సీన్స్ లో సూరి నవ్వించినా మిగతా అంతా కామెడీ లేకపోవడం ఆడియన్స్ కి బోర్ కొడుతుంది. ఇకపోతే ఈ సినిమాకి రన్ టైం కూడా బాగా లాంగ్ అవ్వడం చెప్పదగిన మైనస్ పాయింట్. ఈ సినిమాలో వచ్చే పాటలు ఆడియన్స్ ని మరింత బోర్ ఫీలయ్యేలా చేస్తారు. అలాగే మాస్ ఎంటర్టైనర్స్ లో ఉండే లాజికల్ మిస్టేక్స్ చాలానే ఉన్నాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ఓ సూపర్ అని చెప్పుకోదగిన డిపార్ట్ మెంట్ ఒక్కటి కూడా లేదు. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే.. బాగా తమిళ నేటివిటీ కనపడుతుంది, అలాగే ఎప్పటిలానే హరి స్టైల్ టిపికల్ కెమెరా మూవింగ్ (ఎక్కడి నుంచో కెమెరాని తీసుకొచ్చి హీరో ఫేస్ ని చూపించడం లాంటివి) ఇందులో కూడా ఉంటుంది. ఇది కొన్ని చోట్ల బాగున్నా సినిమా అంతా ఇలానే ఉంటే ఆడియన్స్ కి చిరాకేస్తుంది. ఈ సినిమా విషయంలో కొన్ని చోట్ల ఇదే జరిగింది. ఇకపోతే యువన్ శంకర్ రాజా అందించిన సాంగ్స్ సినిమాకి మైనస్. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే సత్యరాజ్ ఎపిసోడ్ కి వచ్చే మ్యూజిక్ మాత్రమే బెస్ట్ అని చెప్పాలి. మిగతా అంతా బాగా లౌడ్ గా మన దీపావళి పటాకుల్లా డమ్మాల్ డుమ్మీల్ అంటూ సాగుతుంది. విజయన్ – జై కలిసి చేసిన ఎడిటింగ్ ఆడియన్స్ లో పెద్దగా ఆసక్తిని క్రియేట్ చెయ్యలేదు.

మాస్ ఎంటర్టైనర్ కి కావాల్సిన రీతిలోనే ఈసినిమా యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేసుకున్నారు. కానీ ఇకనైనా ఆ గాల్లో ఎగరడాలు లాంటివి తగ్గిస్తే బాగుండు. తెలుగు డైలాగ్స్ ఓకే.. ఇక కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం డీల్ చేసింది హరి.. కథ – కొత్త దనం ఏమీ లేదు, ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ రెగ్యులర్ రివెంజ్ స్టొరీ. స్క్రీన్ ప్లే – కథలో ఉన్న ట్విస్ట్ లు మరియు కంటెంట్ ని ఒక 30 నిమిషాల్లో చెప్పేసి మిగతా అంతా సాగదీశారు. సో బిగ్గెస్ట్ మైనస్ స్క్రీన్ ప్లే. దర్శకత్వం – ఎప్పటిలానే కొన్ని చోట్ల లేదా కొన్ని కొన్ని సీన్స్ పరంగా చూసుకుంటే బాగా తీసారు. విశాల్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

‘భరణి’ తర్వాత విశాల్ – హరి కాంబినేషన్ లో వచ్చిన ‘పూజ’ సినిమా కూడా కేవలం మాస్ ప్రేక్షకులని మాత్రమే టార్గెట్ చేసి చేసిన సినిమా.. అది కూడా మామూలు మాస్ ఆడియన్స్ కాదు… కంటెంట్ తో సంబంధం లేకుండా సినిమా అంటే ఓ ఫైట్, ఓ పాట, ఓ సీన్ మళ్ళీ ఓ ఫైట్.. ఓ పాట.. ఓ ఫైట్ అనే ఫార్ములాని మెచ్చే మాస్ ఆడియన్స్ కి ఇది బాగా కనెక్ట్ అవుతుంది. నటీనటుల పెర్ఫార్మన్స్, శృతి హాసన్ గ్లామర్, కొన్ని చోట్ల ఆడియన్స్ ని పరిగెత్తించే ఎపిసోడ్స్ చెప్పుకోదగిన ప్లస్ పాయింట్స్ అయితే, ఊహాజనిత సెకండాఫ్, నో ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, విలనిజం ని ఎలివేట్ చేయకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్స్. గత కొద్ది రోజులుగా తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన మాస్ ఎంటర్టైనర్స్ ఏమీ లేవు మరియు దీపావళి సీజన్ కారణంగా ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఈ వీకెండ్ బాగా కాసులు కురిపించే అవకాశం ఉంది. చివరిగా రెగ్యులర్ మాస్ ఎంటర్టైనర్స్ కోరుకునే మాస్ ఆడియన్స్ కి మాత్రమే ఇది ‘పూజ’లా అనిపిస్తుంది, మిగతా వారికి ‘బడిత పూజ’లా అనిపిస్తుంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

 

సంబంధిత సమాచారం :