విడుదల తేదీ : డిసెంబర్ 25, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : ప్రణవ్ కౌశిక్, వంశీ పుజిత్, ప్రీతీ పగడాల, ఎస్ పి చరణ్, ఎస్ ఎస్ కాంచి, గౌతమ్ మీనన్ తదితరులు
దర్శకుడు : ప్రణీత్ ప్రత్తిపాటి
నిర్మాతలు : విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మాకా, సురేష్ రెడ్డి కోతింటి, నాని బండ్రెడ్డి
సంగీత దర్శకుడు : జోస్ జిమ్మీ
సినిమాటోగ్రాఫర్ : శక్తి అరవింద్
ఎడిటర్ : చాణక్య రెడ్డి తూర్పు
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ క్రిస్మస్ కానుకగా థియేటర్స్ లో వచ్చిన మొత్తం 8 సినిమాల్లో ఒకటే ‘పతంగ్’ (Patang). బహుశా ఉన్న అన్ని సినిమాల్లో చిన్న సినిమా కూడా ఇదే కావచ్చు. పూర్తిగా కొత్త నటీనటుల్ని పరిచయం చేస్తూ వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
Patang కథ:
తమ చిన్నప్పుడు నుంచే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకరు మాస్ విష్ణు కృష్ణ అలియాస్ విస్కీ (వంశీ పుజిత్) ఒకరు క్లాస్ అరుణ్ (ప్రణవ్ కౌశిక్) లు ఒక గాలిపటం (పతంగ్) మూలాన కలుస్తారు. అక్కడ నుంచి మొదలైన తమ స్నేహం 12 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఇలా ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉండే ఇద్దరి నడుమ ఒక కన్ఫ్యూజ్డ్ అమ్మాయి ఐశ్వర్య (ప్రీతీ పగడాల) ఎంటర్ అవుతుంది. ఈమె ఇద్దరినీ ఇష్టపడుతుంది కానీ అది మొదట ఇద్దరు ఫ్రెండ్స్ కి తెలీదు. ఇలా అరుణ్ కి కొంచెం ఎక్కువ ప్రియార్టీ ఇచ్చి ఈ మేటర్ ని వారు దాస్తారు. కానీ విస్కీకి ఓ రోజు ఎందుకో డౌట్ వచ్చి వీరి కోసం కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఇక అక్కడ వచ్చిన క్లాష్ తో ఇద్దరిలో ఎవరో ఒకరికే అమ్మాయి చెందేందుకు ఫ్రెండ్స్ ఇద్దరినీ కలిపిన పతంగ్ పోటీనే పెట్టుకుంటారు. మరి ఈ పోటీ ఎలా గడిచింది? ఇందులో ఎవరు గెలిచారు? చివరికి ప్రేమ గెలిచిందా? వారి స్నేహం గెలిచిందా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమా దాదాపు 2 గంటల 40 నిమిషాలకి పైనే ఉంటుంది. అయినప్పటికీ ఒక చిన్న సినిమా ఎంటర్టైన్ అవుతారా అనే సందేహానికి ఈ సినిమా మంచి సమాధానమే ఇస్తుంది. పూర్తిగా కొత్త నటీనటులే ప్రధాన పాత్రలు అయినప్పటికీ ముగ్గురు జంట ఈ సినిమాలో సెటిల్డ్ పెర్ఫామెన్స్ లు చేసి ఇంప్రెస్ చేసేసారు.
మాస్ కుర్రాడిగా వంశీ పుజిత్ బాగా చేసాడు. మెయిన్ గా ఇంటర్వెల్ బ్లాక్ ముందు ఎమోషనల్ సీన్ లో చాలా బాగా చేసాడు, క్లాస్ కుర్రాడిగా ప్రణవ్ కూల్ గా మంచి లుక్స్ తో కనిపించి మెప్పించాడు. అలాగే ఒక కన్ఫ్యూజ్డ్ అమ్మాయిగా ప్రీతి కూడా బాగానే చేసింది. ఫస్టాఫ్ సహా సెకండాఫ్ లో కూడా వీరి నటన పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కనిపిస్తుంది.
ఇక వీరితో పాటుగా ఈ సినిమాలో ప్రముఖ నటులు ఎస్ ఎస్ కాంచి, గౌతమ్ మీనన్ లాంటి వారు కూడా కనిపించడమే కాకుండా వారిని ఎలాంటి పాత్రల్లో సెట్ చేయాలో ఎలాంటి సీన్స్ చూపించాలో క్రిస్టల్ క్లియర్ గా ఈ చిత్రంలో కనిపిస్తుంది. అంతే కాకుండా ప్రముఖ గాయకులు ఎస్ పి చరణ్ రోల్ కూడా ఇందులో ఒకింత సర్ప్రైజింగ్ అని చెప్పాల్సిందే. తన ట్రాక్ కూడా క్లీన్ అండ్ ఎంటర్టైనింగ్ గా ఉంది.
ఇక నటీనటులు పరంగా ఎక్కడా వంక లేదు దీనితో పాటుగా ఇందులో మెప్పించే అంశం ఏదన్నా ఉంది అంటే అది ఎంటర్టైనింగ్ కథనమే అని చెప్పవచ్చు. మంచి కామెడీ రైటింగ్ ఇందులో కనిపిస్తుంది. దాదాపు కథనం పెద్దగా బోర్ లేకుండా సాగిపోతుంది. ఇక ఇదే కాకుండా క్లైమాక్స్ పోర్షన్ లో పతంగ్ పోటీ పోర్షన్ కూడా సాలిడ్ గా ఉంది. ఒక పక్క మంచి టెన్స్, మరోపక్క అందులో ఫన్ మిక్స్ చేసి బాగా డిజైన్ చేశారు. అంతే కాకుండా ఈ సీక్వెన్స్ వి ఎఫ్ ఎక్స్ కూడా బాగా మైంటైన్ చేశారు. అలాగే క్లైమాక్స్ ఎండింగ్ కూడా డీసెంట్ గా అనిపిస్తుంది.
మైనస్ పాయింట్స్:
ఈ చిత్రం ఎంత ఎంటర్టైనింగ్ గా ఉన్నప్పటికీ ఇందులో అంత స్ట్రాంగ్ లైన్ లేదు. ఒక రొటీన్ రోమ్ కామ్, ఇది వరకు చూసిన ఫ్రెండ్స్ అండ్ లవ్ కాన్సెప్ట్ లోనే ఉంది కాబట్టి బలమైన కథ లాంటివి కోరుకునేవారికి ఈ చిత్రం కొంచెం డిజప్పాయింట్ చేస్తుంది.
దీనినే తెలివిగా క్లైమాక్స్ లో సెల్ఫ్ క్రిటిసిజం అన్నట్టు పాత్రలు తమకి తామే సెటైర్ వేసుకున్నారు కానీ అలా చెప్పినప్పటికీ ఆ రొటీన్ ఫీల్ మాత్రం అలానే ఉండిపోతుంది. అలాగే అక్కడక్కడ కొన్ని లాజిక్స్ లాంటివి కూడా ఈ సినిమాలో పక్కన పెట్టేస్తేనే బెటర్ అనిపిస్తుంది.
అంతే కాకుండా సెకండాఫ్ లో కథనం కొంచెం సాగదీసినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ క్లైమాక్స్ కి వచ్చేసరికి కొంచెం కథనం పికప్ అవుతుంది. అలాగే బలమైన ఎమోషనల్ మూమెంట్స్ లాంటి వాటిని కోరుకునేవారు కూడా ఈ సినిమాలో వాటిని ఆశించకుండా ఉంటే బాగుంటుంది.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. టెక్నికల్ గా సినిమాని భాగం ప్లాన్ చేసుకున్నారు. మ్యూజిక్ కూడా ఇందులో ఇంప్రెసివ్ గా ఉంది. ప్రతీ పాట కూడా బాగానే ఉంది. విజువల్ ఎఫెక్ట్స్, కెమెరా వర్క్ కూడా బాగున్నాయి. అలాగే ఎడిటింగ్ కూడా బాగానే ఉంది కానీ సెకండాఫ్ లో ఇంకొంచెం బెటర్ గా చేయాల్సింది.
ఇక దర్శకుడు ప్రణీత్ ప్రత్తిపాటి విషయానికి వస్తే.. తన వర్క్ బాగానే ఉందని చెప్పొచ్చు. కాన్సెప్ట్ రొటీన్ గానే ఉన్నప్పటికీ ఎంటర్టైనింగ్ గా ప్లాన్ చేసుకున్న కథనం మెప్పిస్తుంది. అలాగే నటీనటులు నుంచి మంచి పెర్ఫామెన్స్ లు రాబట్టడం, దాదాపు ప్లాన్ చేసుకున్న కథనాన్ని పర్ఫెక్ట్ గా ముగించడంలో తన పనితనం కనిపిస్తుంది. కాకపోతే కాన్సెప్ట్ కూడా కొత్తగా ఏమన్నా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ ‘పతంగ్’ సినిమా యువతకి అలానే ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా డీసెంట్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుంది. లీడ్ నటీనటులు కొత్తవాళ్లే అయినా బాగా చేశారు. అలాగే ఎస్ పి చరణ్, కాంచి లాంటి నటులు, వారి కామెడీ ట్రాక్స్, టెక్నికల్ అంశాలు ఈ సినిమాలో ఒకింత సర్ప్రైజింగ్ గా ఉంటాయి. కథ రొటీన్ గానే ఉంది కానీ మంచి ఫన్ ఇందులో ఉంది. సో ఒక డీసెంట్ ఎంటర్టైనర్ ని చూడాలి అనుకుంటే ఈ సినిమా మెప్పిస్తుంది.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team


