2021లో విడుదలై బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘సినిమా బండి’ చిత్రం ఈ శుక్రవారంతో (మే 15) ఐదేళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా అందులో ‘మరిడేశ్ బాబు’ పాత్రతో ప్రేక్షకులకు దగ్గరైన యువ నటుడు రాగ్ మయూర్ ఆనందం వ్యక్తం చేశారు. తన కెరీర్‌ను మలుపుతిప్పిన ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగులకు, నిర్మాతలు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకేలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తొలి సినిమాకే ఇంత మంచి గుర్తింపు రావడం తన అదృష్టమన్నారు.
‘సినిమా బండి’ ఇచ్చిన బ్రేక్‌తో రాగ్ మయూర్ వెనుతిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత వీరాంజనేయులు విహారయాత్ర, కీడా కోలా, గాంధీతాత చెట్టు లాంటి చిత్రాలతో పాటు హిట్ వెబ్ సిరీస్ ‘పంచాయత్’ తెలుగు రీమేక్ ‘సివరాపల్లి’తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సిరీస్ సక్సెస్ తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చిందని, ఇప్పుడు దర్శకులు తనకోసమే ప్రత్యేకంగా పాత్రలు రాస్తున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సమంత ‘శుభం’లో క్యామియో, అనుపమ ‘పరదా’లో రాజేష్ పాత్రలతో పాటు ‘మిత్ర మండలి’లో ఆయన డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ప్రస్తుతం గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్న ‘గరివిడి లక్ష్మి’ చిత్రంలో రాగ్ మయూర్ ఓ బుర్రకథ కళాకారుడిగా సవాలుతో కూడిన పాత్రలో నటిస్తున్నారు. థియేటర్ ఆర్టిస్ట్‌గా ఉన్న అనుభవం తన నటనను మరింత మెరుగుపరిచిందని, కెరీర్ ప్రారంభంలోనే అగ్రశ్రేణి దర్శకులతో పనిచేసే అవకాశం రావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. వాస్తవికతకు పెద్దపీట వేసే ఎమోషనల్ కథల్లో నటించడమే తన లక్ష్యమని రాగ్ మయూర్ స్పష్టం చేశారు.


