సమీక్ష : రాగల 24 గంటల్లో- ఆకట్టుకొనే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్.

Published on Nov 23, 2019 8:40 am IST

విడుదల తేదీ : నవంబర్ 22, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : సత్యదేవ్, ఈషా రెబ్బా, శ్రీరామ్, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ, కృష్ణభగవాన్, టెంపర్ వంశీ, అజయ్, అనురాగ్, రవి వర్మ, రవిప్రకాష్, మానిక్ రెడ్డి, అదిరే అభి తదితరులు.

దర్శకత్వం : శ్రీనివాస్ రెడ్డి

నిర్మాత‌లు : శ్రీనివాస్ కానూరు

సంగీతం :  రఘు కుంచె

సినిమాటోగ్రఫర్ : గ‌రుడ‌వేగ అంజి

ఎడిటర్:  తమ్మిరాజు

 

సత్యదేవ్, ఈషా రెబ్బ హీరో హీరోయిన్లుగా శ్రీరాం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `రాగల 24 గంటల్లో`. శ్రీ నవహాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ బానర్స్‌పై ‘ఢమరుకం’ ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్ కానూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి ఈ చిత్రం ఎంత వరకు ప్రేక్షకులకు థ్రిల్ పంచిందో సమీక్షలో చూద్దాం….

కథ:

ఓ ఫేమస్ ఫోటోగ్రాఫర్ అయిన రాహుల్(సత్యదేవ్) అనాధ అయిన విద్య( ఈషా రెబ్బా) ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను పొంది పెళ్లి చేసుకున్న రాహుల్ కి విద్యకు తన మిత్రుడైన గణేష్(గణేష్ వెంకట రామన్) తో ఉన్న స్నేహం,సాన్నిహిత్యం చూసి తట్టుకోలేక పోతాడు. దీనితో మెంటల్ గా అప్సెట్ అయిన రాహుల్ గణేష్, విద్య లతో వాదనకు దిగుతాడు. తారాస్థాయికి చేరిన ఆగొడవ కారణంగా రాహుల్ హత్యకు గురవుతాడు. అసలు రాహుల్ ని విద్య చంపిందా? లేక విద్య స్నేహితుడు గణేష్ చంపాడా? లేక వీరిద్దరూ కలిసి రాహుల్ ని చంపారా? వీరిద్దరూ కాకుండా మూడో వ్యక్తి ఎవరైనా చేశారా? అనేది తెరపై చూసి తెలుసుకోవాలి.

 

ప్లస్ పాయింట్స్:

ఈ మూవీలో ప్రధాన ఆకర్షణ సత్య దేవ్ అని చెప్పాలి. మంచి నటుడిగా ఇప్పటికే అనేక చిత్రాలలో నిరూపించుకున్న ఆయన ఈ మూవీలో మరో స్థాయి నటనను కనబరిచారు. సైకో లక్షణాలు కలిగిన భర్త గా నెగెటివ్ పాత్రలో ఆయన జీవించారు.

చాలా కాలం తరువాత నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కించుకున్న ఈషా రెబ్బా మెప్పించారు. కీలకమైన సస్పెన్సు సన్నివేశాలతో పాటు, ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన కట్టిపడేస్తుంది. ఈమూవీ తరువాత ఈషా రెబ్బా తెలుగులో ప్రాముఖ్యం ఉన్న పాత్రలు దక్కించుకునే అవకాశం కలదు.

ఇక కొంత గ్యాప్ తరువాత తెలుగు సినిమాలో కథకు కీలకమైన పోలీస్ అధికారి పాత్ర చేసిన హీరో శ్రీరామ్ తనదైన హావభావాలతో ఆకట్టుకుంటారు.

సినిమాలో చెప్పుకోదగ్గ మలుపులు లేనప్పటికీ ఒక క్రైమ్ స్టోరీని తెరపై ఎక్కడా నిరాశ కలిగించకుండా నడిపించిన విధానం నచ్చుతుంది. మూవీలో ఒకటి రెండు మినహా ప్రతి సన్నివేశం కథలో భాగంగా ఆసక్తికరంగా సాగుతుంది. తక్కువ నిడివి గల పాత్రలో మస్కన్ సేథీ పర్వాలేదనిపించారు.

 

మైనస్ పాయింట్స్:

సినిమా ఆసాంతం ఆసక్తికరంగా సాగినప్పటికీ ప్రధానమైన మర్డర్ సన్నివేశంలో స్పష్టత లోపించింది. ఈషా ఇంటిలో ఉండగా మర్డర్ ఎలా జరిగిందనే విషయంలో లాజిక్ మిస్ ఐయ్యింది. ఈ సన్నివేశాన్ని ఇంకా కొంచెం వివరంగా చెప్పివుంటే బాగుండు అనిపిస్తుంది.

అలాగే ముందుగా చెప్పిన విధంగా ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీలో ఉండే ఊహించని మలుపు ఈ మూవీలో లేవు. చివరికి క్లైమాక్స్ ట్విస్ట్ చాలా సులభంగా అంచనా వేసేదిగా ఉంది.
 

సాంకేతిక విభాగం:

ఒక చిన్న సినిమా బడ్జెట్ పరిధిలో మూవీ నిర్మాణ విలువలు పర్వాలేదన్నట్లుగా ఉన్నాయి. సినిమా చాలా భాగం ఓ బంగ్లాలో జరుగుతుంది. ఆ బంగ్లా నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను కెమెరా మెన్ తెరపై ఆవిష్కరించిన తీరుమెప్పిస్తుంది. ఎడిటింగ్ పర్వాలేదు అన్నట్లుగా ఉంది. పతాక సన్నివేశాలలో వచ్చే మస్కన్ సేథీ సాంగ్ అంతగా సినిమాకు ఆకర్షణగా నిలవలేదు. ఆ సాంగ్ తొలగిస్తే బాగుండు అన్న భావన కలిగింది.

ఇక దర్శకుడు శ్రీనివాసరెడ్డి గురించి చెప్పాలంటే ఆయన ప్రతిభ ఆకట్టుకుంటుంది. ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఓ స్థాయి మలుపులు, అలరించే సన్నివేశాలతో మూవీ ఎక్కడా విసుగు కలిగించకుండా తెరకెక్కించాడు. ప్రేక్షకులకు పరీక్ష పెట్టే తికమక స్క్రీన్ ప్లే వద్దనుకున్న ఈయన తాను చెప్పాలనుకున్నది స్ట్రైట్ గా చెప్పారు.

 

తీర్పు:

మొత్తంగా చెప్పాలంటే రాగల 24గంటల్లో ఆసాంతం అలరించే క్రైమ్ థ్రిల్లర్ గా చెప్పవచ్చు. మెస్మరైజ్ చేసే ట్విస్ట్ లు, మతిపోయే సన్నివేశాలు లేకున్నప్పటికీ ఎక్కడా నిరాశ పరచకుండా సాగే ఈ చిత్రం ప్రేక్షకుడికి మంచి అనుభూతిని పంచుతుంది. భారీ అంచనాలు లేకుండా వెళ్లిన ప్రేక్షకుడికి ఈ చిత్రం ఆద్యంతం అలరిస్తుంది. ఈవారం సినిమాలలో రాగల 24గంటల్లో తెలివైన ఎంపికే అని చెప్పుకోవచ్చు.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :