బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ చేస్తున్న తాజా చిత్రం ‘రాధే’. ప్రభుదేవా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మీద బాలీవుడ్ ప్రేక్షకుల్లో తారాస్థాయి అంచనాలున్నాయి. ఈ 2020 ఈద్ సందర్బంగా సినిమా విడుదలకావాల్సి ఉండగా కోవిడ్ కారణంగా వాయిదాపడింది. షూటింగ్ కూడ కొంత భాగం మిగిలింది. లాక్ డౌన్ అనంతరం షూటింగ్ మొదలుపెట్టి అక్టోబర్ నెలలో ముగించేశారు. మొదట ఈ సినిమాను యష్ రాజ్ ఫిలింస్ సంస్థ కమీషన్ పద్దతిలో ఇండియా, ఓవర్సీస్ నందు రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడా ప్లాన్ మారింది.
సీన్లోకి జీ స్టూడియోస్ సంస్థ ప్రవేశించింది. భాయ్ సినిమా యొక్క థియేట్రికల్ హక్కులు, శాటిలైట్ రైట్స్, డిజిటల్ హక్కులు, మ్యూజిక్ రైట్స్ అన్నింటికీ కలిపి ఏకంగా 230 కోట్ల రూపాయలు జీ స్టూడియోస్ సంస్థ చెల్లించినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా సినిమా, థియేటర్ రంగం నెమ్మదించినా కూడ సల్మాన్ సినిమా ఈ స్థాయి బిజినెస్ చేయడం చూస్తే ఆయన ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థమవుతోంది. సొహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రిలతో కలిసి సల్మాన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దిశా పఠాని కథానాయకిగా నటించింది. 2021 ఈద్ సందర్బంగా మే 12న ఈ చిత్రం విడుదలకానుంది.


