ఇంటర్వ్యూ : అశ్విన్ బాబు – అందుకే తమన్నా స్థానంలో అవికా ను తీసుకున్నాం.

ఇంటర్వ్యూ : అశ్విన్ బాబు – అందుకే తమన్నా స్థానంలో అవికా ను తీసుకున్నాం.

Published on Oct 12, 2019 4:31 PM IST

రాజాగారు గది ప్రాంచైజీ లో వస్తున్న మూడవ చిత్రం రాజుగారి గది 3. హారర్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 18న విడుదల కానుంది. అశ్విన్ బాబు, అవికా గౌర్ ప్రధాన పాత్రలలో నటించగా, ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కింది. మూవీ విడుదల నేపథ్యంలో హీరో అశ్విన్ బాబు పాత్రికేయుల సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలు పంచుకున్నారు.

రాజుగారి గది3 చిత్రం గురించి చెప్పండి?

అసలు రాజుగారి గది చిత్రానికి కొనసాగింపుగా చిత్రాలు చేస్తామని ఊహించలేదు. రాజుగారి గది మూవీ విజయం సాధించడంతో రాజుగారి గది2 చిత్రాన్ని నిర్మించాము. ఆ మూవీని కూడా ప్రేక్షకులు ఆదరించడంతో రాజుగారి గది 3 చిత్రాన్ని చేయడం జరిగింది.

కొత్తగా రాజుగారి గది 3 మూవీలో ప్రేక్షకులకు కొత్తగా ఏమి చూపించనున్నారు?

రాజుగారి గది 2 చిత్రంలో కొంచెం ఎంటర్టైన్మెంట్ తగ్గిందని ఆడియన్స్ ఫీలయ్యారని మాకు తెలిసింది. అందుకోసం ఈ మూవీలో ఎంటర్టైన్మెంట్ పాళ్ళు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అలీగారు, బ్రహ్మాజీగారు, ఉర్వశమ్మ, అజయ్ ఘోష్ గారు చేసే కామెడీ చాలా బాగా అలరిస్తుంది.

స్టార్ క్యాస్ట్ లేని రాజుగారి గది 3 మూవీ అంచనాలు అందుకుంటుందా?

రాజుగారి గది2 మూవీలో నాగార్జున, సమంత వంటి స్టార్ క్యాస్ట్ చేశారు. స్టార్ క్యాస్ట్ లేకున్నా ఈ మూవీలో కామెడీ తోపాటు, ప్రేక్షకులకు కావలసిన అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ మూవీలో స్టార్స్ లేకున్నా ఖచ్చితంగా అంచనాలు అందుకుంటాం అని నమ్మకం ఉంది.

మొదట తమన్నా అనుకున్నారు కదా, ఆమె ఎందుకు చేయలేదు?

తమన్నా బిజీ షెడ్యూల్ వలన మాకు డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరలేదు. దీనితో తమన్నా స్థానంలో అవికా గౌర్ ని తీసుకోవడం జరిగింది. ఆమె ఈ మూవీకి అస్సెట్ గా నిలిచారు. అవికా నటన ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది.

ఒకే టైటిల్ తో మూవీలు చేస్తున్నారు ఎందుకు?

రాజుగారి గది చిత్రం చేస్తున్నప్పుడు దీనికి సీక్వెల్ చేస్తాం అని అస్సలు అనుకోలేదు. మొదటి పార్ట్ మంచి హిట్ సాధించడంతో దానికి సీక్వెల్ రాజుగారి గది2 చేశాం. ఇప్పుడు ఈ మూవీ హిట్ అయితే రాజుగారి గది 4 తీసే అవకాశం కలదు. టైటిల్ ఒకటైనా సబ్జెట్స్ మాత్రం డిఫరెంట్.

ఈ మూవీలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

మొదటి రెండు చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రంలో నా రోల్ ఉంటుంది. పూర్తిగా మాస్ రోల్ ట్రై చేశాను. ఒక పూర్తి స్థాయి మాస్ హీరో తరహాలో నా పాత్ర సాగుతుంది. ఈ చిత్రంతో నాకు ఓ ఇమేజ్ వస్తుందని భావిస్తున్నాను.

సినిమా బడ్జెట్ పట్ల మీ అభిప్రాయం ఏంటీ?

హీరో మార్కెట్ పరిధి లోపే మూవీ నిర్మాణం ఉండాలి. అప్పుడే నిర్మాతలు మూవీ నిర్మించడం వలన ఒక రూపాయి మిగులుతుంది. సొంత నిర్మాణ సంస్థ ఉన్న కుటుంబం నుండి వచ్చినవాడిగా నిర్మాతల కష్టనష్టాలు తెలుసు. మూవీ తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తే నిర్మాతలకు అప్పుల భారం తగ్గుతుంది.

దర్శకత్వం చేసే ఆలోచన ఏమైనా ఉందా?

అది నా వల్ల కాదు, నిజానికి దర్శకుడు పడే కష్టం ఎవరూ పడరు. నిజంగా దర్శకుడవ్వాలంటే పెట్టిపుట్టుండాలి. దర్శకత్వం క్లిస్టమైన వ్యవహారం.

మీ భవిష్యత్ చిత్రాల గురించి చెప్పండి?

రెండు మూడు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. ఇతర భాషలో విజయం సాధించిన గోదా టైటిల్ తో కుస్తీ నేపథ్యంలో ఒక సబ్జెట్ ఉంది, దానిని ఓంకార్ అన్నయ్య, చోటా కె నాయుడు అన్నయ్య వింటున్నారు. ఐతే ఇంకా ఏది ఫైనల్ కాలేదు.

మీరు అసలు ఎలాంటి చిత్రాలు చేయాలనుకుంటున్నారు?

ఇప్పుడు ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. సబ్జెట్ ఏదైనా కానీ రెండున్నర గంటలు వారిని నవ్వించాలి, ఎంటర్టైన్ చేయాలి. దానితో పాటు కొంచెం కొత్తగా ఏమి చెప్పినా యాక్సెప్ట్ చేస్తారు. అందుకే అలాంటి చిత్రాలు చేయాలనుకుంటున్నాను. ఈ మూవీ అలాగే ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు