గత ఏడాది మలయాళంలో ట్రెండ్ సెట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా ‘బెంగుళూరు డేస్’. ఈ సినిమాని తెలుగు – తమిళ భాషల్లో రీమేక్ చెయ్యాలనే ఉద్దేశంతో పివిపి – దిల్ రాజు కలిసి ఈ సినిమా రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితమే తమిళ రీమేక్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కానీ ఇంకా తెలుగులో మాత్రం మొదలు కాకపోవడమే కాకుండా, ఇంకా నటీనటుల ఎంపికల విషయంలోనే ఆగిపోయారు. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం శర్వానంద్, వరుణ్ తేజ్, నిత్యా మీనన్, శ్రీనివాస్ అవసరాలని ముఖ్య పాత్రల కోసం సెలక్ట్ చేసారని తెలియజేశాం.
తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ లో గోల్డెన్ గర్ల్ గా దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ ని ఈ సినిమా కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో అంగవైకల్యం ఉన్న ఆర్.జె పాత్ర కోసం రకుల్ ప్రీత్ ని ఎంపిక చేసారని సమాచారం. మలయాళంలో ఈ పాత్రని పార్వతి నాయర్ చేసింది. ఈ పాత్ర కోసం రకుల్ ప్రీత్ పార్ట్ కి సంబందించిన షూటింగ్ 12 రోజుల మాత్రమే ఉంటుంది. రాకుల్ ప్రీత్ ఇప్పటికే రామ్ చరణ్, ఎన్.టి.ఆర్, మహేష్ బాబు సినిమాలకు ఫుల్ డేట్స్ ఇచ్చేసి తైట్ షెడ్యూల్స్ లో ఉంది. అయినప్పటికీ తను ఈ సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ విషయం పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ నటించిన పండగ చేస్కో, కిక్ 2 సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.


