నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో.. ఆయన తండ్రి ‘నందమూరి తారకరామారావు’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రం, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కిస్తున్నారు. చరిత్ర కలిగిన గొప్ప గొప్ప పాత్రలు ఉన్న ఈ చిత్రంలో.. ఆ పాత్రల స్థాయికి తగట్లుగానే ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది. ప్రస్తుతం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా బయోపిక్ షూటింగ్ లో పాల్గొంది
‘వేటగాడు’ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘ఆకు చాటు పింద తడిసె’ను ఈ చిత్రంలో మళ్ళీ చూపించనున్నారు. బాలకృష్ణ – రకుల్ ప్రీత్ సింగ్ ల పై ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ రోజు రకుల్ జన్మదినం సందర్భంగా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రబృందం శ్రీదేవి గెటప్ లో ఉన్న ఆమె ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. రకుల్, శ్రీదేవి పోలికలతో కనిపిస్తూ బాగానే ఆకట్టుకుంటుంది.
ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ట్యూన్స్ కూడా అద్భుతంగా వచ్చాయట. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది.


