‘రంగస్థలం’ మిమ్మల్ని నిరుత్సాహపరచదు – రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం ‘రంగస్థలం’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకురానుంది. టీజర్, పాటలు బాగుండటంతో ఈ చిత్రంలో అభిమానుల్లో, సినీ వర్గాల్లో గట్టి నమ్మకాలున్నాయి. ‘ధృవ’ తరవాత చాలా కాలం పాటు చేసిన ఈ చిత్రంపై చెర్రీ కూడ భారీ అశలు పెట్టుకున్నారు.

నిన్న ఒక ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్న రామ్ చరణ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘సినిమా మిమ్మల్ని నిరుత్సాహపరచదు. దాదాపు 365 కష్టపడి ఈ సినిమా చేశాం. 10 ఏళ్ళ నా కెరీర్లో నేను చేసిన బెస్ట్ మూవీ, బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదే. ఎప్పుడూ నా సినిమా చూడండని నేను అడగలేదు. కానీ ఈ సినిమాను చూడమని చెప్తున్నాను’ అన్నారు. ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ వేడుక రేపు వైజాగ్లో భారీ ఎత్తున జరగనుంది.