
సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా సగభాగం షూటింగ్ ముగిసింది. ప్రస్తుతం టీమ్ హైదరాబాద్లో సేదతీరతున్నారు. ఎక్కువ భాగం చిత్రీకరణ అటవీప్రాంతంలోనే జరిపారు. ఇందుకోసం మారేడుమిల్లి అడవులను ఎంచుకున్నారు సుకుమార్. అక్కడే ప్రత్యేకమైన సెట్ వేసి మరీ షూటింగ్ చేశారు. భారీ వ్యయంతో వేసిన ఈ సెట్ ను ఇప్పుడు రామ్ చరణ్ వాడుతున్నారట. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్న చరణ్ మెగాస్టార్ చిరంజీవి యొక్క ‘ఆచార్య’లో ఒక కీ రోల్ చేస్తున్నారు.
ఈయన పాత్ర మీద షూటింగ్ ఎక్కువ భాగం అడవుల్లోంర్ ఉంటుందట. అందుకోసమే మారేడుమిల్లి అడవులను ఎంచుకున్నారట కొరటాల శివ. ఇక ఆల్రెడీ ఆ అడవుల్లో ‘పుష్ప’ కోసం వేసిన సెట్ అలానే ఉంది. దాంతో మళ్లీ కొత్త సెట్ వేయడం ఎందుకని భావించిన టీమ్ అదే సెట్ ను షూటింగ్ కోసం వాడుకుంటున్నారట. ప్రస్తుతం చరణ్ ఆ సెట్లోనే కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ జోడీ పూజా హెగ్డే కూడ పాల్గొంటోందట. చిరు, చరణ్ కలిసి చేస్తున్న ఫుల్ లెంగ్త్ మూవీ కావడంతో ‘ఆచార్య’ మీద భారీ అంచనాలున్నాయి అభిమానుల్లో. డిస్ట్రుబ్యూటర్లు సైతం రికార్డ్ ధర చెల్లించి హక్కులు కొనుగోలు చేస్తున్నారు. మే 13వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ బ్రహ్మాండంగా ఆకట్టుకోవడంతో ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫాన్స్.