మొదట్నుంచీ విభిన్న పాత్రలు ఎంపిక చేసుకుంటూ యువ హీరోల్లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో రామ్. తన ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న రామ్, తాజాగా నటించిన ‘పండగ చేస్కో’ విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందే ‘శివం’, ‘హరికథ’ అనే రెండు సినిమాల షూటింగ్‌తో జోరుమీదున్నాడు రామ్. స్రవంతి రవికిషోర్ నిర్మాతగా సొంత సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై రామ్ ఈ రెండు సినిమాలను చేస్తూ ఉండడం విశేషం. ‘శివం’ సినిమాకు శ్రీనివాస్ రెడ్డి దర్శకుడు కాగా, ‘హరికథ’ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు.
శివం, హరికథ(వర్కింగ్ టైటిల్) సినిమాలకు సంబంధించిన పోస్టర్లను నేడు రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. రామ్ ‘శివం’ పోస్టర్‌లో సిగరెట్ నోట్లో పెట్టుకొని టెర్రిఫిక్ లుక్‌తో ఆకట్టుకుంటే, హరికథ పోస్టర్‌లో చాలా కూల్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. తన పుట్టినరోజున అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తానని చెప్పిన రామ్, ఈ రెండు పోస్టర్లతో మంచి బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక గోపీచంద మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘పండగ చేస్కో’ ఈ నెలాఖర్లోనే విడుదల కానుంది. ‘శివం’, ‘హరికథ’ సినిమాలు ఈ ఏడాది చివరికల్లా విడుదల కానున్నాయి. ఇలా ఒకే సంవత్సరం రామ్ మూడు సినిమాలు విడుదల చేయనుండడం నిజంగానే శుభపరిణామమే.
నేడు 26వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ యువహీరోకి 123తెలుగు తరపున శుభాకాంక్షలు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న రామ్‌కు ఈ ఏడాది మంచి విజయాలు దక్కాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.


