ఆయన మాటలతో నమ్మకం మరింత పెరిగిందన్న రానా !


‘బాహుబలి’ తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న హీరో రానా తన తదుపరి సినిమాల్ని చాలా జాగ్రత్తగా, విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన సినిమాల్లో అందరినీ అమితంగా ఆకర్షిస్తున్న చిత్రం ‘ఘాజి’. భారదేశ చరిత్రలో 1971 లో ఇండియా – పాక్ ల మధ్య మొట్ట మొదట జరిగిన జలాంతర్గామి యుద్ధం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రమోషన్లలో ఈ చిత్రం గురించి రానా మాట్లాడుతూ ‘మొదట అండరు వాటర్ వార్ ఫిల్మ్ కి సైన్ చేశానని చెప్పగానే చాలా మంది నన్ను పిచ్చివాడని అనుకున్నారు. ఇలాంటి సినిమాలెందుకు అన్నారు’.

అలాగే ‘గత 20 ఏళ్లలో ఘాజి మెరైన్ చరిత్ర తెలియకుండానే ఎన్నోసార్లు దాన్ని చూశాను. తరువాత డైరెక్టర్ సంకల్ప్ దగ్గర స్క్రిప్ట్ ఉందని తెలియగానే సంతోషించాను. మొదట రాజమౌళి ఈ సినిమా చేస్తున్నాను అనగానే చాలా మెచ్చుకున్నారు. తరువాత సినిమాని కరణ్ జోహార్ కు చూపించగానే ఆయనే దాన్ని హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తానని చెప్పారు. ఆయన మాటలతో సినిమాపై నమ్మకం మరింత ఎక్కువైంది. ఇప్పుడు చాలా మంది ఈ సినిమా పట్ల ఆసక్తిగా ఉన్నారు’ అంటూ తన అనుభవాల్ని తెలిపాడు. ఇకపోతే ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.