ఇక ‘బాహుబలి’ నుంచి రానా బయటకు !
Published on Sep 14, 2016 2:52 pm IST

rana-in-baahubali
తెలుగు చిత్ర సీమ గర్వించదగ్గ చిత్రం ‘బాహుబలి’ ని రాజమౌళి ప్రారంభించి ఇప్పటికి మూడేళ్లు దాటిపోయింది. ఈ చిత్రం కోసం రానా, ప్రభాస్ లు చాలా ఎక్కువ కాలం వెచ్చించారు. గత సంవత్సరం ఈ సిరీస్ లో మొదటి భాగం ‘బాహుబలి – ది బిగినింగ్’ విడుదలై ఘన విజయం సాదించింది. అలాగే రెండవ భాగం ‘బాహుబలి – ది కన్ క్లూజన్’ కూడా 80 % షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో చిత్రంలో కీలకమైన ‘భల్లాలదేవ’ పాత్ర పోషించిన రానా ఇక ప్రాజెక్ట్ నుండి బయటికి రానున్నాడని తెలుస్తోంది. దర్శకుడు రాజమౌళి సినిమాలో ముఖ్యమైన యుద్ధ సన్నివేశాల్ని, ఇతర ప్రధాన సన్నివేశాల్ని ముగించడంతో దాదాపు రానా వంతు షూటింగ్ పూర్తయిందట.

ఇక ఎలాగూ పాటల్లో రానా పాత్ర పెద్దగా ఉండకపోవడం, మిగిలిన కాస్త ప్యాచ్ వర్క్ లో కూడా కొద్దిపాటి సీన్లే మిగిలి ఉండటంతో రానా దర్శకుడు వంశీతో చేయవలసిన తన తరువాతి సినిమా పనుల్ని చక్కబెట్టుకుంటున్నాడని సమాచారం. అలాగే ప్రభాస్ కూడా త్వరలో తన వంతు భాద్యతల్ని నెరవేర్చి సుజిత్ డైరెక్షన్లో చేయాల్సిన ప్రాజెక్ట్ పై దృష్టి పెడతాడట. ఇకపోతే జక్కన్న ఈ అద్భుతాన్ని 2017 ఏప్రిల్ 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

 
Like us on Facebook