రానాకు అంతగా నవ్వు తెప్పించిన ఆ న్యూస్ ఏంటో !


‘బాహుబలి’ తో దేశవ్యాప్త గుర్తింపు పొందిన నటుడు దగ్గుబాటి రానా పై ఈ మధ్య అందరి దృష్టి ఎక్కువైంది. అంత భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన ఎలాంటి సినిమాలు ఎంచుకుంటాడు, ఏ దర్శకులతో పనిచేస్తాడో చూడాలని ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నైపథ్యంలో కొందరి అత్యుత్సాహం వలన బయలుదేరిన ఒక పుకారు రానాకు విపరీతమైన నవ్వు తెప్పించింది.

అదేమిటంటే నిన్నటి నుండి రానా ప్రముఖ దర్శకుడు వివి.వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారని, ఈ మేరకు ఆయన తండ్రి సురేష్ బాబు ప్రయత్నాలు జరుపుతున్నారని రక రకాల వార్తలు హడావుడి చేస్తూ రానా వరకు వెళ్లాయి. ఆ రూమర్లపై స్పందిస్తూ రానా తన ట్విట్టర్ ద్వారా పెద్దగా నవ్వుతూ అలాంటిదేమీ లేదని, తాను ట్విట్టర్లో ఉన్నాను కాబట్టి తన సినిమాల గురించి తానే స్వయంగా చెబుతానని అన్నారు. ఇకపోతే ప్రస్తుతం ఆయన తేజ దర్శకత్వంలో చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.