
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమా విజయంతో తెలుగులో పాగా వేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, అతి కొద్దికాలంలోనే వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ‘లౌక్యం’ హిట్ తర్వాత ‘కిక్ 2’, ‘పండగ చేస్కో’, రామ్ చరణ్ – శ్రీను వైట్ల సినిమా, ఎన్టీఆర్-సుకుమార్‌ల సినిమా.. ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈ సినిమాల్లో రామ్ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘పండగ చేస్కో’ ఈ నెల 29న విడుదల కానుండగా, సురేందర్ రెడ్డి – రవితేజల ‘కిక్ 2’ జూన్‌లో విడుదల కానుంది.
వరుస సినిమా అవకాశాలతో బిజీ కావడం పట్ల రకుల్ ఆనందాన్ని వ్యక్తం చేసింది. తన కష్టం వృధా పోలేదని, వరుస అవకాశాలతో బిజీగా మారడం హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైందని చెప్పుకొచ్చింది. “రవితేజ గారు చిన్న స్థాయి నుంచి ఇప్పుడో స్టార్ హీరోగా ఎదిగారు. అప్పుడు, ఇప్పుడూ ఆయన కష్టమే ఆయనను ఆ స్థాయిలో నిలబెట్టింది. అలాంటి రవితేజ గారు, నిన్ను చూసినప్పుడల్లా, నాకు నేనే గుర్తొస్తుంటా. బాగా కష్టపడటం నీలో నాకు నచ్చే అంశం” అనడం నాలో మరింత ఉత్తేజాన్ని నింపుతోందని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది.

