
గుణశేఖర్ ఎన్నో ఏళ్ళ పాటు పరిశోధించి, దాదాపుగా మూడేళ్ళ పాటు కష్టపడి తెరకెక్కించిన కలల ప్రాజెక్ట్ ‘రుద్రమదేవి’ అక్టోబర్ 9న భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. రాణీ రుద్రమదేవి లాంటి వీరవనిత చారిత్రక కథ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమాపై మొదట్నుంచే విపరీతమైన పాజిటివ్ బజ్ కనిపించింది. ఇక విడుదల తర్వాత కూడా అదే స్థాయిలో ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సంపాదించి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు కొల్లగొడుతోంది.
అనుష్క, అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ముఖ్యంగా నైజాం ఏరియాలో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. దసరా సెలవులు కావడం, చారిత్రక నేపథ్య కథ కావడంతో ఫ్యామిలీ ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి కనబరచడం వంటి విషయాలు రుద్రమదేవికి నైజాంలో బాగా కలిసివచ్చాయి. రెండో వారం రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీతో పాటు రుద్రమదేవి కూడా మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఇక ఈ వారం కలెక్షన్లు మరింతగా పెరిగే సూచనలున్నాయని ట్రేడ్ టాక్.
ఒక చారిత్రక కథను ప్రేక్షకులకు చేరవేయాలన్న గుణశేఖర్ ఆలోచనకు, అల్లు అర్జున్, అనుష్కల నటనకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. భారతదేశపు మొట్టమొదటి స్టీరియోస్కోపిక్ 3డీ సినిమా అయిన రుద్రమదేవి, తెలుగుతో పాటు తమిళ, హిందీ, మళయాల భాషల్లోనూ విడుదలైంది.

