“సాహో” విడుదల తేదీపై వీడిన సస్పెన్స్, రిలీజ్ ఎప్పుడంటే?

Published on Jul 19, 2019 9:40 am IST

ఆగస్టు 15న విడుదల కావల్సివున్న “సాహో” ను అనూహ్యంగా వాయిదావేస్తూ చిత్ర యూనిట్ చేసిన ప్రకటన అభిమానులను,సినీ ప్రేమికులను ఒకింత నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులకు ఈ వార్త పిడుగుపాటులా మారింది. కారణం గత ఆరేళ్లలో ప్రభాస్ చేసింది రెండు చిత్రాలు మాత్రమే. 2013లో ‘మిర్చి’ విడుదల తరువాత రెండేళ్లకు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి-ది బిగినింగ్’ 2015లో విడుదల అయ్యింది. దీనికి కొనసాగింపుగా తెరకెక్కిన ‘బాహుబలి-కంక్లూషన్’ కూడా మరో రెండేళ్లకు 2017లో విడుదల చేశారు.

‘బాహుబలి’ తరువాతైనా ప్రభాస్ చకచకా సినిమాలు చేస్తాడనుకుంటే ప్రభాస్ ‘సాహో ‘లాంటి మరో పెద్ద ప్రాజెక్ట్ ఒప్పుకొని మరో రెండేళ్లు ఆ చిత్రానికి కేటాయించారు. ఎట్టకేలకు ఆగస్టు 15న ప్రభాస్ ని సినిమా తెరపై చూద్దామన్న అభిమానుల ఆశలు మూవీ విడుదల వాయిదా నిర్ణయంతో అడియాసలయ్యాయి.

ఎట్టకేలకు సాహో విడుదలపై ఉత్కంఠకు,ఊహాగానాలకు తెరదించుతూ చిత్ర నిర్మాతలు విడుదల తేదీ ప్రకటిస్తూ ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. సాహో ని ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తెలియపరిచారు. ఈ ప్రకటన ప్రభాస్ అభిమానులకు పండగ లాంటి వార్తే అని చెప్పాలి. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తుండగా,జాకీ ష్రాఫ్,నీల్ నితిన్ ముఖేష్,మురళి శర్మ,వెన్నెల కిషోర్ కీలక పాత్రలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :