సంక్రాంతి సినిమాల యూఎస్ బాక్సాఫీస్ రిపోర్ట్
Published on Jan 17, 2017 8:44 am IST

khaidi-gpsk-shatamanm
ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా సంక్రాంతి సీజన్‌కు తెలుగు సినిమా బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ముఖ్యంగా ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలయ్య నటించిన ప్రతిష్టాత్మక సినిమాలు విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. వీటికి తోడు సరిగ్గా సంక్రాంతి రోజున దిల్‌రాజు నిర్మించగా, శర్వానంద్ హీరోగా నటించిన ‘శతమానం భవతి’ కూడా విడుదలై ఆ సినిమా కూడా మంచి వసూళ్ళతో దూసుకుపోతోంది. ఇలా మూడు సినిమాలు హిట్ దిశగా వెళుతూ ఉండడం విశేషంగా చెప్పుకోవాలి.

ఇక ఈమధ్య కాలంలో అన్ని పెద్ద సినిమాలకు ఓ అతిపెద్ద మార్కెట్‌గా అవతరించిన యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ మూడు సినిమాలు వసూళ్ళ వర్షం కురిపిస్తున్నాయి. సరిగ్గా ఆదివారం పూర్తయ్యేసరికి అన్ని సినిమాలూ దాదాపుగా లాభాల బాట పట్టినట్లు ట్రేడ్ సమాచారం. ఈ మూడు సినిమాలూ కలిపి ఒక్క వీకెండ్‌లోనే సుమారు 3.75 మిలియన్ డాలర్లు వసూలు చేయడం అన్నది ప్రత్యేకంగా చూడాలి.

మంగళవారం రోజున ప్రీమియర్ షోస్‌తో మొదలైన ఖైదీ నంబర్ 150 సందడి ఇప్పటికీ జోరుగానే కొనసాగుతోంది. వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమా 2.09మిలియన్ డాలర్లు (సుమారు 14.29కోట్ల రూపాయలు) వసూలు చేసింది.

ఇక ఖైదీ నంబర్ 150 వచ్చిన ఒకరోజు తర్వాత నుంచి సందడి మొదలుపెట్టిన బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి ఆయన కెరీర్‌కే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమా 1.25 మిలియన్ డాలర్లు (సుమారు 8.57కోట్ల రూపాయలు) వసూలు చేసింది.

ఇక రెండు పెద్ద సినిమాల మధ్యన విడుదలైనా తన ఉనికి చాటుకుంటూ మంచి వసూళ్ళు రాబడుతోన్న శతమానం భవతి, యూఎస్ బాక్సాఫీస్ వద్ద వీకెండ్ పూర్తయ్యేసరికి 411 కే డాలర్లు (సుమారు 2.80కోట్ల రూపాయలు) వసూలు చేసింది. ఇక వర్కింగ్ డేస్ మొదలవ్వడంతో ఒక నాలుగు రోజులు కలెక్షన్స్ మామూలుగానే ఉన్నా, వీకెండ్‌లో అన్ని సినిమాలూ మళ్ళీ పుంజుకునే అవకాశం కనిపిస్తోంది.

 
Like us on Facebook