ఇంటర్వ్యూ : శశి కిరణ్ టిక్క – నాకు శేఖర్ కమ్ములగారి గట్స్ అంటే చాల బాగా ఇష్టం.

ఇంటర్వ్యూ : శశి కిరణ్ టిక్క – నాకు శేఖర్ కమ్ములగారి గట్స్ అంటే చాల బాగా ఇష్టం.

Published on Aug 6, 2018 5:44 PM IST

అడివి శేష్, శోభిత దూళిపాళ్ల హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో తెరకెక్కిన్న చిత్రం ‘గూఢచారి’. అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై అభిషేక్ నామా, టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీసు వద్ద కూడా మంచి ఓపెనింగ్స్ తో దూసుకెళ్తుంది. ఈ సంధర్బంగా ఈ చిత్ర దర్శకుడు శశి కిరణ్ టిక్క మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

సినిమా రెస్పాన్స్ ఎలా ఉంది?
సినిమా గురించి రెస్పాన్స్ చాలా బాగుంది అండి. ప్రేక్షకులందరూ సినిమా చూసి కొత్తగా ఫీల్ అయ్యాం అని చెప్తున్నారు. అసలు మేం సినిమా తీసేముందే, సినిమా ఎలా ఉన్నా మంచి ప్రయత్నం చేశారు అంటారు తప్ప, మమ్మల్ని ఎవరు తిట్టర్లే అనుకున్నాం. కానీ ఇంతలా పొగడ్తలతో ముంచెత్తుతారని అనుకోలేదు.

మీ పై ఇంగ్లీష్ సినిమాల ప్రభావం బాగా ఉన్నట్టుంది ?
ఇంగ్లీష్ సినిమాల ప్రభావం ఉందనే చెప్పాలి. అంటే ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలు చూడటం వల్ల, కొన్నాళ్ళు ఫిల్మ్ స్కూల్ కోసం యుఎస్ లో ఉండటం వల్ల ఆ సినిమాల ప్రభావం కొంతవరకు ఉంది. కానీ ఓ ఇంగ్లీష్ స్క్రిప్ట్ ఇచ్చి దాన్ని సినిమాగా తియ్యమంటే మళ్ళీ నేను తియ్యలేను. నేను ఎప్పటికీ ఎమోషన్స్ పరంగా తెలుగు సినిమా మేకర్ నే.

మీరు ఎవరి దగ్గర అన్నా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారా ?
శేఖర్ కమ్ములగారి దగ్గర లీడర్ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పని చేశాను. నా మీద శేఖర్ గారి ప్రభావం కూడా చాలా ఉంది. నిజం చెప్పాలంటే యాక్షన్ సీన్స్ తియ్యటం నాకు అస్సలు రాదు. గూఢచారి చిత్రం తెరకెక్కించబోయే ముందు అసలు యాక్షన్ ఎలా తీస్తారు. టేకింగ్ ఎలా ఉంటుంది షాట్ ఎలా కట్ చేస్తారు ఇలా అన్ని నేర్చుకొని ఈ సినిమా తీశాను.

మీకు అడివి శేష్ మొదటిసారి ఈ కథ చెప్పినప్పుడు బాగాలేదు అన్నారట, ఎందుకు కథ మీద కాన్ఫిడెన్స్ కలగలేదా ?
అంటే శేష్ రాసుకున్న అప్పటి వర్షన్ బాగాలేదు అన్నాను. అది కొంచెం రాంగ్ వే లో ఉంది. అందుకే బాగాలేదు అన్నాను. కానీ కథ ఎప్పుడు బాగాలేదు అనలేదు. ఎందుకంటే నాకు కథ మీద మొదటి నుంచి చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఆ తర్వాత మేం ఈ కథకు దాదాపు ఎనిమిది నెలలు పాటు స్క్రీన్ ప్లే రాసాము. ఎప్పుడు మేం స్క్రిప్ట్ డైవలప్ చేస్తూనే వచ్చాం. సెన్సార్ స్క్రిప్ట్ అయ్యాక కూడా కొన్ని బెటర్మెంట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

స్క్రీన్ ప్లే లో ఎక్కువుగా ఎవరి పాత్ర ఉంది ?
ఆలా చెప్పలేము అండి. నేను, అడివి శేష్ తో పాటు, రాహుల్ అని ఇంకో అతను. మేం ముగ్గురం కూర్చొని ఈ సినిమా స్క్రీన్ ప్లే మీద పని చేయడం జరిగింది. నిజానికి ఎవరు ఏ పాయింట్ చెప్పారో, ఏ సీన్ రాశారో మాకు కూడా తెలియదు. ముగ్గురం కలిసి స్క్రీన్ ప్లే చేశాము.

సుప్రియాగారు ఈ సినిమాలో నటించడానికి కారణం ఏమిటి ?
నాకు సుప్రియాగారు పరిచయం లేరండీ. కానీ శేష్ కు ఆవిడ మంచి ఫ్రెండ్. మొదట ఈ సినిమాలో యాక్ట్ చెయ్యడానికి ఆవిడ ఒప్పుకోలేదు, నేను సరిగ్గా చెయ్యను, వేరే వాళ్ళను చూసుకొండి అన్నారు. ఫైనల్ గా ఆవిడని కన్వీన్స్ చేసి ఈ చిత్రంలో నటించడానికి ఒప్పించాము. నాకు మాత్రం మొదటి నుంచి నదియా ఖురేషి పాత్రలో ఆమె కరెక్ట్ అనిపించారు.

ఈ సినిమాలో ఎడిటింగ్ వర్క్ చాలా బాగుంది ? మీరు ఎడిటింగ్ కోసం ఏమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారా ?
అలాంటిది ఏం లేదు. ఎడిటింగ్ ఇంత బాగా రావడానికి మా ఎడిటర్ ‘గారి’నే కారణం. తను క్షణం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. ఆ సినిమాకి కూడా చాలా వరకు ఎడిటింగ్ షూట్ లో కూర్చున్నాడు. బహుశా తాను డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పని చెయ్యడం వల్ల ఓ డైరెక్టర్ గా సీన్ ను ఆలోచించి కట్ చెయ్యటం వల్ల ఈ సినిమాకి ఎడిటింగ్ ఇంత బాగా వచ్చింది అనుకుంటున్నాను.

మీరు తీసిన గూఢచారి చిత్రం భారీ విజయం సాధించింది. మరి మీకు చాలా ఆఫర్స్ వచ్చి ఉంటాయిగా ?
ఇప్పటివరకు సినిమా చూసిన ప్రొడ్యూసర్స్ లో కొంతమంది అడిగారు. మనం ఒక సినిమా చేద్దాం అని. కొంతమంది కథ ఏదన్నా ఉంటే చెప్పమన్నారు. నేనింత వరకు ఎవరికీ ఏ కథ చెప్పలేదు. చూడాలి

మీ తరువాత సినిమా ఏ జోనర్ లో తీస్తారు ?
ఫలానా జోనర్ అని నేను ఏమి అనుకోలేదండి.అయినా (నవ్వుతూ) ఎప్పుడు ఒకే జోనర్ లోనే తియ్యాలి అని ఏ డైరెక్టర్ అనుకోడు కదా.

మీ దగ్గర పూర్తి అయిన స్క్రిప్ట్స్ ఎన్ని ఉన్నాయి ?
ఒక స్క్రిప్ట్ రాయటానికే సంవత్సరం పడుతుంది. అలాంటిది ఇంక స్క్రిప్ట్స్ అంటే… ప్రస్తుతం నా దగ్గర పూర్తి అయిన స్క్రిప్ట్ ఒక్కటి కూడా లేదు. ఇక మీదటే రాసుకోవాలి.

అడివి శేష్ తో మీకు ఎప్పటినుంచి పరిచయం ?
నాకు శేష్ కి మధ్య ప్రయాణం దాదాపు ఎనిమిది సంవత్సరాలు నుంచి.. తను నన్ను బాగా నమ్మాడు. మేం చాలా సార్లు సినిమా చేద్దామనుకున్నాం. కానీ నా కథలు తనకు నచ్చేవి కాదు, తను చెప్పిన కథలు నాకు నచ్చేవి కాదు. అంటే ఏదోకటి చేసెయ్యడం మా ఇద్దరికీ ఇష్టం లేదు. అందుకే లేట్ అయింది. చివరికి గూఢచారితో మీ ముందుకు వచ్చాం.

మీరు శేఖర్ కమ్ములగారి దగ్గర పని చేశారు కదా. ఆయన దగ్గర ఏమి నేర్చుకున్నారు ?
ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. నేను ఆయన దగ్గర తప్ప ఇంక ఎవరి దగ్గర పని చెయ్యలేదు. నాకు అయన గట్స్ చాల బాగా ఇష్టం. ఆయన దాదాపు ఒక సినిమా కోసం రెండు సంవత్సరాలు కష్టపడతారు. ఆయన స్క్రిప్ట్ రాసుకునే విధానం కానీ, ఆయన సినిమాని తెరకెక్కించే శైలి కానీ నాకు చాలా బాగా నచ్చుతుంది.

మీరు కూడా అడివి శేష్ లాగే యాక్టర్ అవుతారా ?
అలాంటిది ఏం లేదండి. నేను ఓన్లీ చేయించుకోగలను కానీ చెయ్యలేను. అయినా అందం ఉంటే చాలు ఆర్టిస్ట్ అయిపోవచ్చు అనుకుంటే అది రాంగ్. ఒకవేళ అదే నిజమైతే మోడల్స్ అందరూ ఆర్టిస్ట్ లు అయిపోయేవాళ్ళుగా. ఆర్టిస్ట్ అవ్వాలంటే పర్సనాలిటీ ఒక్కటే సరిపోదు, చాలా క్వాలిటీస్ కావాలి.

గూఢచారి చిత్రంలో ప్రేక్షకులకు ఎక్కువుగా ఏ అంశాలు నచ్చుతున్నాయి అనుకుంటున్నారా ?
ఓవరాల్ గా గూఢచారి సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను. సినిమాలో ప్రతి అంశాన్ని ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నామని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు