గోల్డెన్ భాగ్యం: బిర్యానీ vs ఇడ్లీ సాంబార్.. సత్య, యోగి బాబు కాంబినేషన్‌లో క్రేజీ ‘తెలుమిల్’ మూవీ

గోల్డెన్ భాగ్యం: బిర్యానీ vs ఇడ్లీ సాంబార్.. సత్య, యోగి బాబు కాంబినేషన్‌లో క్రేజీ ‘తెలుమిల్’ మూవీ

Published on Sep 29, 2026 12:04 PM IST

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోని ప్రముఖ హాస్య నటులు సత్య, యోగి బాబు కాంబినేషన్‌లో ఓ సరికొత్త కామెడీ ఎంటర్‌టైనర్ పట్టాలెక్కింది. ‘రంగబలి’ ఫేమ్ పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కు ‘గోల్డెన్ భాగ్యం’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్ర బృందం గ్లింప్స్‌ను విడుదల చేసింది. డ్రీమ్ మూవీ మేకర్స్, నయవాయు చిత్రాలు బ్యానర్లపై నాగార్జున రెడ్డి, పవన్ బాసంశెట్టి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు నిర్మాణ సంస్థలకూ ఇది తొలి ప్రాజెక్ట్.

ఆకట్టుకునే ‘తెలుమిల్’ కాన్సెప్ట్

ఇది సాధారణ తెలుగు లేదా తమిళ సినిమా మాత్రమే కాకుండా, రెండు భాషల నటీనటులు, సంస్కృతులను మేళవిస్తూ రూపొందిస్తున్న ‘తెలుమిల్’ చిత్రం. విడుదలైన గ్లింప్స్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. ఒక తెలుగు వ్యక్తి కూల్‌డ్రింక్‌తో బిర్యానీ తింటూ, ఒక తమిళ వ్యక్తి ఇడ్లీ సాంబార్ ఆరగిస్తూ ఎవరి ఆహారం గొప్పదో సరదాగా వాదించుకోవడంతో వీడియో మొదలవుతుంది. ఆ సమయంలో మరో వ్యక్తి ఎంట్రీ ఇచ్చి, అంతకంటే పెద్ద క్రేజీ కాంబినేషన్ రాబోతోందని చెప్పడంతో సత్య, యోగి బాబు రంగప్రవేశం చేస్తారు.

వైట్ అండ్ వైట్ దుస్తుల్లో స్టైలిష్‌గా కనిపించిన వీరిద్దరికీ దర్శకుడు కథను వివరిస్తూ.. ఇందులో లవ్, క్రైమ్, యాక్షన్ అంశాలు ఉంటాయని స్పష్టం చేస్తారు. ఇందులో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. తెలుగు నటుడైన సత్య తమిళంలో, తమిళ నటుడైన యోగి బాబు తెలుగులో మాట్లాడటం. వీరి వెనుక భారీ మల్టీస్టారర్ కటౌట్లు ఉంచి ఈ క్రేజీ కాంబోను వినూత్నంగా పరిచయం చేశారు.

తారాగణం, సాంకేతిక బృందం

ఈ చిత్రంలో జయశ్రీ, అధిరాజ్ కథానాయికలుగా నటిస్తుండగా.. వెన్నెల కిశోర్, సుదర్శన్, కిశోర్ తిరుమల, రోహిణి, తనికెళ్ల భరణి, సునీల్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పవన్ సిహెచ్ సంగీతం అందిస్తుండగా, మలయాళ సినిమాటోగ్రాఫర్ బబ్లూ అజు కెమెరా బాధ్యతలు, రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడిగా కామేష్ పనిచేస్తున్నారు.

సినిమా రిలీజ్ విషయంలోనూ చిత్ర యూనిట్ సరదాగా స్పందించింది. తొలుత సంక్రాంతి అని చెప్పి, ఆ తర్వాత సంక్రాంతి దాటాక అని మార్చి, చివరకు ఇదే ఏడాది థియేటర్లలోకి వస్తున్నట్లు ప్రకటించిన తీరు సరదాగా అనిపించింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు