ఇంటర్వ్యూ : శర్వానంద్ – ధరమ్ తేజ్ చెప్పాడని ఈ కథ విన్నాను !

12th, January 2017 - 08:00:42 PM

Sharwanand
‘రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా’ వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో శర్వానంద్ ఈసారి కూడా తనకి కలిసొచ్చిన సంక్రాంతికి ‘శతమానం భవతి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ సందర్బంగా ఈ చిత్రం గురించి ఆయన తెలిపిన పలు ఆసక్తికర విషయాలు మీ కోసం..

ప్ర) ఈ సినిమా ఎలా ఉండబోతోంది ?
జ) ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. మనుషుల మధ్యన ఉండే సంబంధాలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే అందరూ ఆనందంగా ఉంటారు అనే అంశాలు ఇందులో ఉంటాయి.

ప్ర) ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది ?
జ) ఇందులో నాది పెద్దగా కొత్తదనమున్న పాత్రేమీ కాదు. రెగ్యులర్ పాత్రే. కానీ ప్రెజెంట్ చేసిన విధానం బాగుంటుంది. అనుబంధాలకు, ప్రేమలకు ఎక్కువ విలువిచ్చే క్యారెక్టర్.

ప్ర) ఖైదీ, శాతకర్ణి లాంటి పెద్ద సినిమాలతో రిలీజ్ అవుతున్నారు. ఏమైనా ఇబ్బంది ఫీలవుతున్నారా ?
జ) లేదు. ఎలాంటి ఇబ్బందీ లేదు. లాస్ట్ ఇయర్ కూడా 3 పెద్ద సినిమాలతో కలిసి నా సినిమా రిలీజయింది. సంక్రాంతికి ఎన్ని సినిమాలైనా రిలీజ్ అవొచ్చు. అందరికీ సెలవులుంటాయి కనుక కథ బాగుంటే ప్రతి సినిమా ఆడుతుంది.

ప్ర) మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది ?
జ) నా పాత్ర పుట్టిన పల్లెటూరిలో పెరిగిన ఒక కుర్రాడు ఎప్పటికీ అక్కడే ఉంటూ వ్యవసాయం చేసుకుని బ్రతుకుతూ తాత ఆశయాలను కొనసాగించాలని అనుకుంటూ ఉంటుంది. ప్రేమనైతే అందరికీ పంచొచ్చుగాని, బాధని పంచి వాళ్లని కూడా బాధపెట్టడం ఎందుకని అనుకునే పాత్ర.

ప్ర) ప్రకాష్ రాజ్, జయసుధ లాంటి వారితో పనిచేయడం ఎలా ఉంది ?
జ) ప్రకామేశ్ రాజ్ లాంటి పెద్ద నటులతో పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఇక జయసుధగారైతే కనిపించిన వెంటనే మన అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అందరూ నాకు చాలా దగ్గరయ్యారు.

ప్ర) సినిమాలో మీకు నచ్చిన వేరే పాత్రలు ఏమైనా ఉన్నాయా ?
జ) ఒకటుంది. అది నరేష్ గారు చేశారు. కాస్ట్ మొత్తంలో నాకు చాలా బాగా నచ్చిన, దగ్గరైన పాత్ర అది. అయన కూడా చాలా బాగా నటించారు. చాలా సరదగా ఉంటుంది.

ప్ర) ఈ కథ మీదగ్గరకి ఎలా వచ్చింది ?
జ) ధరమ్ తేజ్ ఈ కథ విని స్వయంగా నన్ను సజెస్ట్ చేశాడు. నేను మొదట్లో చేయకూడదని అనుకున్నా. కానీ పాయింట్ విని వెంటనే ఓకే చెప్పేశాను.

ప్ర) బివిఎస్ఎన్ ప్రసాద్ గారి సినిమా ఎంతవరకు వచ్చింది ?
జ) ఆ ప్రాజెక్టులో 4 పాటలు, కొంచెం టాకీ పార్ట్ బ్యాలెన్స్ ఉంది. త్వరలోనే అయిపోతుంది. ఇందులో నాది ఫన్నీ పోలీస్ పాత్ర. సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్.

ప్ర) ప్రస్థానం తరహా సీరియస్ సినిమాలు ఎప్పుడు చేస్తారు ?
జ) నాకు చేయాలనే ఉంది. దేవా కట్ట ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. అది వర్కవుట్ అవుతుందేమో చూడాలి.

ప్ర) మిక్కి జె మేయర్ పాటలు బాగా హిట్టయినట్టున్నాయి ?
జ) అవును. మిక్కీ ఇరగ్గొట్టేశాడు. అన్ని పాటలు చాలా అద్భుతంగా వచ్చాయి. సినిమా అక్కడే సగం హిట్టయినట్టు అనిపంచింది. ముఖ్యంగా ఎస్పీ బాలుగారు మొదటిసారి నా సినిమా కోసం పాడారు. అది మర్చిపోలేని అనుభూతి.

ప్ర) ఈ సినిమా ఆడియన్స్ కు ఎలాంటి ఫీల్ ఇస్తుంది ?
జ) చాలా రిఫ్రెషింగ్ గా ఉండే స్క్రిప్ట్ ఇది. చాలా బాగ్ నచ్చుతుంది. సినిమా చూశాక ప్రతి ఒక్కరు ఒక్కసారి ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడతారు. ఖచ్చితంగా చెప్పగలను.

ప్ర) ఇక ఈ సినిమా గురించి, మీ గురించి కొత్త విషయాలేమన్నా చెప్తారా ?
జ) నా గురించంటే ఈ 2017లో నావి 3 సినిమాలు రిలీజ్ అవుతాయి. ఇక సినిమా గురించంటే ఇక్కడ రిలీజ్ అవడానికన్నా ఒక్కరోజు ముందు అంటే 13న యూఎస్ లో రిలీజ్ అవుతుంది. కారణం మాత్రం నాకు తెలీదు. దిల్ రాజుగారినే అడగండి (నవ్వుతూ).