ఓటీటీ వేదిక : జీ5
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : జనవరి 23, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు : విక్రమ్ ప్రభు, ఎల్‌కె అక్షయ్ కుమార్, అనిష్మ అనిల్ కుమార్, ఆనంద తంబిరాజ
దర్శకత్వం : సురేష్ రాజకుమారి
నిర్మాత : ఎస్ఎస్ లలిత్ కుమార్
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్
సినిమాటోగ్రఫీ : మాదేష్ మాణికం
ఎడిటింగ్ : ఫిలోమిన్ రాజ్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
తమిళ నటుడు విక్రమ్ ప్రభు కెరీర్‌లో 25వ చిత్రంగా తెరకెక్కిన సినిమా ‘సిరాయ్’ (Sirai). క్రిస్మస్ సందర్భంగా తమిళనాట రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
(Sirai) కథ :
2003 నేపథ్యంలో గుంటూరులో సాగే ఈ కథలో శ్రీనివాస్(విక్రమ్ ప్రభు) ఓ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటాడు. అతను ఒక ఎస్కార్ట్ డ్యూటీలో ఉండగా ఓ ఖైదీ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఆ ఖైదీని శ్రీనివాస్ కాల్చడంతో అతడు మృతిచెందుతాడు. ఉన్నతాధికారులు శ్రీనివాస్‌పై విచారణకు ఆదేశిస్తారు. అయితే, శ్రీనివాస్‌పై విచారణ కొనసాగుతుండగా మరో ఎస్కార్ట్ డ్యూటీలో అబ్దుల్ రౌఫ్(ఎల్.కె.అక్షయ్ కుమార్) అనే హంతకుడిని వాహనంలో తరలిస్తుంటారు. ఈ క్రమంలో మార్గమధ్యలో అబ్దుల్ కనిపించకుండా పోతాడు. కోర్టులో మరుసటి రోజే అతడిని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది..? శ్రీనివాస్ అతడి టీమ్ అబ్దుల్‌ను పట్టుకోగలిగారా..? ఇంతకీ అబ్దుల్ ఎవరు..? అతడి నేపథ్యం ఏమిటి..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
పోలీస్ జీవితానికి సంబంధించి కొన్ని అరుదైన అంశాలను ఈ సినిమాలో చూపెట్టారు. మిగతా సినిమాల్లో లాగా కేవలం ఉన్నతాధికారులపై ఫోకస్ పెట్టకుండా ఓ ఏఆర్ కానిస్టేబుల్ చుట్టూ కథను నడిపిన తీరు బాగుంది. శ్రీనివాస్ పాత్రను పోలీస్ కంటే ముందు ఓ మనిషినని నమ్మే వ్యక్తిగా చక్కగా ప్రెజెంట్ చేశారు. దీంతో ప్రేక్షకులకు అతడి పాత్ర బాగా కనెక్ట్ అవుతుంది.
విక్రమ్ ప్రభు ఓ చక్కటి పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటాడు. కానీ, ఈ సినిమాకు నిజమైన హీరో మాత్రం ఎల్‌కె అక్షయ్ కుమార్. తన పాత్రలోని డైలమా, బాధ తదితర అంశాలను ఆయన ప్రదర్శించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సినిమాలో ఆయన పాత్రకు చాలా ప్రాధాన్యత లభిస్తుంది.
అబ్దుల్ తన కోణంలో వివరించే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఎమోషనల్‌గా మరియు ఆకట్టుకునేలా సాగుతుంది. ఎమోషన్‌తో పాటు కొన్ని సీన్స్‌లో వచ్చే సస్పెన్స్, ముఖ్యంగా తప్పించుకునే క్రమంలో, ప్రీ-క్లైమాక్, క్లైమాక్స్ సమయాల్లో వచ్చే సస్పెన్స్ అదిరిపోయింది.
తప్పించుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ ఎపిసోడ్, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. కోర్ట్‌రూమ్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. కళావతి పాత్రలో అనిష్మ అనిల్ కుమార్ చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మిగతా నటీనటులు తమ పాత్రల మేర మెప్పించారు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ చాలా తక్కువగా చెప్పగలం. సినిమా ప్రారంభం కొంతవరకు రొటీన్‌గా సాగుతుంది. కానీ, నెరేషన్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.
విక్రమ్ ప్రభు లీడ్ రోల్ అయినప్పటికీ, ఆయన పాత్ర గొప్పగా లేదు. ఆయన పాత్ర స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉన్నప్పటికీ, కావాల్సినన్ని ఎక్స్‌ప్రెషన్స్ రాలేదనిపిస్తుంది. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ట్రాక్ పూర్తిగా డెవలప్ చేయలేదనిపిస్తుంది. ఇక ఆయన భార్య పాత్ర సినిమాకు పెద్దగా చేసిందేమి లేదు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో వారి లవ్ స్టోరి, విభేదాలు వంటి సీన్స్‌ను మరికొంత చూపెట్టాల్సింది.
సాంకేతిక విభాగం :
తొలి సినిమా అయినప్పటకీ దర్శకుడు సురేష్ రాజకుమారి తన స్క్రీన్ ప్లే, ఎగ్జిక్యూషన్‌తో ఆకట్టుకున్నారు. అనుభవం ఉన్న దర్శకుడిగా ఆయన ఈ చిత్రాన్ని తీర్చిన తీరు బాగుంది. జస్టిన్ ప్రభాకరన్ బీజీఎం ఈ సినిమాకు మరో హైలైట్‌గా నిలిచింది. సస్పెన్స్, ఎమోషనల్ మూమెంట్స్‌కు ఈ బీజీఎం ప్రాణం పోసింది. మాదేష్ మాణికం సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు డీసెంట్‌గా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ చక్కగా కుదిరింది.
తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే.. ‘సిరాయ్’ (Sirai) ఒక ఎంగేజింగ్ క్రైమ్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సాలిడ్ స్క్రీన్ ప్లే, సినిమాను మలిచిన తీరు మెప్పిస్తాయి. విక్రమ్ ప్రభు డీసెంట్‌గా ఉన్నా, ఎల్‌కె అక్షయ్ కుమార్ అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటారు. పోలీస్ స్టేషన్ ఎపిసోడ్, ఫ్లాష్‌బ్యాక్ పోర్షన్స్, ఎమోషనల్ సీన్స్, సస్పెన్స్‌తో సాగే క్లైమాక్స్ సినిమాకు బలంగా నిలిచాయి. సినిమా ప్రారంభంలో నెమ్మదిగా సాగే కథనం కొంతవరకు మైనస్. సస్పెన్స్ క్రైమ్ డ్రామాలను ఇష్టపడేవారు ‘సిరాయ్’ (Sirai) సినిమాను ట్రై చేయవచ్చు.
123telugu.com Rating: 3.25/5
Reviewed by 123telugu Team


