తమిళ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న ‘పరాశక్తి’ సినిమా విడుదల తేదీపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని, నాలుగు రోజుల ముందే అంటే జనవరి 10, 2026న విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎగ్జిబిటర్లు మరియు డిస్ట్రిబ్యూటర్ల అభ్యర్థన మేరకు ఈ మార్పు చేసినట్లు నిర్మాతలు వెల్లడించారు.
అయితే, ఈ నిర్ణయం కోలీవుడ్‌లో పెను సంచలనంగా మారింది. స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ జనవరి 9న విడుదల కానుంది. సరిగ్గా ఒక్క రోజు వ్యవధిలోనే శివకార్తికేయన్ సినిమా కూడా బరిలోకి దిగుతుండటంతో, థియేటర్ల కేటాయింపులో తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఇది విజయ్ సినిమా వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, సోషల్ మీడియాలో ఇరు హీరోల అభిమానుల మధ్య అప్పుడే మాటల యుద్ధం మొదలైంది.
సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పరాశక్తి’ 1960లలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమ నేపథ్యంతో రూపొందుతోంది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా రానా దగ్గుబాటి, అథర్వ, బాసిల్ జోసెఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.


