పూరీ నిర్మాతతో శ్రీను వైట్ల సినిమా!

srinu-vaitla
గత కొద్దికాలం వరకూ తెలుగులో టాప్ డైరెక్టర్స్‌లో ఒకరుగా గొప్ప గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు శ్రీనువైట్లకు ‘ఆగడు’ తర్వాత బ్యాడ్ టైమ్ మొదలైంది. ‘ఆగడు’ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలవ్వడం, ఆ తర్వాత వచ్చిన ‘బ్రూస్ లీ’ కూడా అదే స్థాయిలో పరాజయం పాలవ్వడంతో శ్రీనువైట్ల క్రేజ్ పూర్తిగా తగ్గిపోయింది. ఇక ఈ నేపథ్యంలో మళ్ళీ తనదైన సినిమాతో మెప్పించేందుకు శ్రీను వైట్ల ప్రస్తుతం సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన తదుపరి సినిమాను సి. కళ్యాణ్‌ నిర్మాణంలో చేయనున్నట్లు తెలుస్తోంది.

పూరీ జగన్నాథ్‌తో చేసిన ‘లోఫర్’ సినిమాను విడుదలకు సిద్ధం చేసిన సి.కళ్యాణ్, ఆ సినిమా విశేషాలను పంచుకుంటూ, తన తదుపరి సినిమా ప్రస్తావనను కూడా తీసుకువచ్చారు. దర్శకుడు శ్రీనువైట్లతో తన తదుపరి సినిమా ఉంటుందని సి. కళ్యాణ్ ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, అన్నీ పూర్తవ్వగానే ఓ అఫీషియల్ ప్రకటన ఉంటుందని ఆయన తెలిపారు. మరి శ్రీను వైట్ల తానేంటో నిరూపించుకోవాల్సిన టైమ్‌లో ఎవరితో, ఎలాంటి సినిమా చేయబోతున్నాడన్నది ప్రస్తుతం ఆసక్తికర అంశం.

Exit mobile version