చరణ్ – సుకుమార్ సినిమాలో నటించనున్న స్టార్ డైరెక్టర్ కుమారుడు !


లాంగ్ గ్యాప్ తర్వాత ‘ధృవ’ చిత్రంతో భారీ విజయానందుకున్న రామ్ చరణ్ తేజ్ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. పూర్తి గ్రామీణ నైపథ్యంలో సాగే ఈ కథలో చరణ్ మునుపెన్నడూ లేని విధంగా చాలా కొత్తగా కనిపించనున్నాడు. ఇంకొద్ది రోజుల్లోనే ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూట్ మొదలవనుండగా కొద్ది సేపటి క్రితమే ఒక కొత్త వార్త బయటికొచ్చింది.

అదేమిటంటే ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి కుమారుడు హీరో వైభవ్ రెడ్డి ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో నటించనున్నాడట. అయితే ఈ విషయమై సినిమాకు సంబందించిన వ్యక్తుల నుండి ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. తెలుగులో పలు సినిమాల్లో నటించిన వైభవ్ ప్రస్తుతం తమిళంలో మంచి ఆఫర్లతో బిజీగా ఉన్నాడు. గతంలో వైభవ్ తండ్రి దర్శకుడు కోదండరామిరెడ్డి, మెగాస్టార్ చిరంజీవిలది సూపర్ హిట్ కాంబినేషన్ కావడంతో ఈ వార్తపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇకపోతే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిచనున్న ఈ చిత్రంలో చరణ్ కు జోడీగా సమంత నటించనుంది.