అమెరికాలో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సందడి!

అమెరికాలో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సందడి!

Published on May 19, 2015 8:46 PM IST

Subramaswar-for-sale
‘పిల్లా.. నువ్వులేని జీవితం’ అంటూ తన మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న సాయిధరమ్ తేజ్, ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘రేయ్’ తర్వాత సాయి ధరమ్ నటించిన మూడో సినిమా సుబ్రమణ్యం ఫర్ సేల్. ఈమధ్యే ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక షెడ్యూల్ అమెరికాలో మొదలైన విషయం తెలిసిందే.

సుమారు 30 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ మూడు పాటలు చిత్రీకరిస్తున్నారు. అమెరికాలో జరుగుతున్న షూటింగ్ విశేషాలను ఓ ప్రముఖ టీవీ చానెల్‌తో పంచుకుంది సినిమా యూనిట్. ఎప్పట్నుంచో అమెరికాలో షూటింగ్ చేయాలన్నది తన కలని, అయితే ఇప్పటివరకూ తన సినిమాల్లో ఆ అవకాశం రాలేదని, ఈ సినిమా స్క్రిప్ట్‌కి అమెరికా నేపథ్యంలోని సన్నివేశాలు కచ్చితంగా అవసరముండడంతో అక్కడ షూటింగ్ చేస్తున్నామని దర్శకుడు హరీష్ శంకర్ తెలిపారు.

ప్రస్తుతం హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనా, బ్రహ్మనందం పాల్గొనగా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. అమెరికాలో షూటింగ్ సందడి సందడిగా జరుగుతోందని, అమెరికాలో ఉన్నా హైద్రాబాద్‌లో ఉన్న ఫీలింగే కలుగుతోందని సాయి ధరమ్ తేజ్, రెజీనాలు తమ అనుభూతులను పంచుకున్నారు.

తాజా వార్తలు