
‘అంతకుముందు ఆ తరువాత’, ‘లవర్స్’, ‘కేరింత’ సినిమాలతో మంచి విజయాలను అందుకున్న హీరో సుమంత్ అశ్విన్ తాజాగా ‘కొలంబస్’ అనే మరో లవ్‍స్టోరీతో సిద్ధమైన విషయం తెలిసిందే. ఆర్. సామలను దర్శకుడిగా పరిచయం చేస్తూ అశ్వినీ కుమార్ సహదేవ్ నిర్మించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని దసరా కానుకగా విడుదల కానుంది. మొదట సినిమాను నవంబర్ నెలలో విడుదల చేయాలని భావించినా, తాజాగా దసరా సీజన్ నుంచి అఖిల్ సినిమా తప్పుకోవడంతో కొలంబస్ కొద్దివారాలు ముందుకొచ్చి దసరా కానుకగా అక్టోబర్ 22నే అలరించేందుకు సిద్ధమైంది.
సుమంత్ అశ్విన్ గత చిత్రాల స్టైల్లోనే మంచి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ ఉదయం ప్రసాద్ ల్యాబ్స్‌లో హీరో వెంకటేష్ ఈ సినిమాకు సంబంధించిన బిగ్ సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. టీజర్ బాగుందని, సినిమా మంచి విజయం సాధించాలని కోరుతూ సుమంత్ అశ్విన్‌కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇక జితిన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోను రేపు విడుదల చేయనున్నారు. ఒక్కో పాటను ఒక్కో టీవీ చానల్‌లో వినూత్నంగా విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ ఈ సందర్భంగా తెలిపింది. ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ సరసన శీరత్ కపూర్, మిస్తీ చక్రవర్తి హీరోయిన్లుగా నటించారు.

