ఇంటర్వ్యూ : నిర్మాత సురేష్ కొండేటి – ఈ చిత్రం అంత‌కుమించిన ఘ‌న‌విజయం సాధిస్తోంది !

Published on May 22, 2019 8:50 pm IST

ప్రముఖ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ లిసా. తెలుగు, తమిళ భాషల్లో త్రీడి టెక్నాలజీతో తెరకెక్కిన ఈ చిత్రానికి రాజు విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రం ఈనెల 24న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సురేష్ కొండేటి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

ముందుగా, ‘లిసా 3డి’ గురించి చెప్పండి ?

‘లిసా’ రెగ్యులర్ హారర్ ఫిల్మ్ లా ఉండదు. ఈ సినిమాను త్రీడి టెక్నాలజీతో తీయడం జరిగింది. అయితే సినిమాలో హార‌ర్‌ చాలా బాగుంటుంది. అలాగే సెంటిమెంట్ హైలైట్‌ గా నిలుస్తోంది. రెండు గంటలు పాటు లిసా ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తూ ఆకట్టుకుంటుంది.

సినిమాలో విజువల్స్ చాలా బాగా వచ్చాయట. వాటి గురించి చెప్పండి ?

విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. ముఖ్యంగా సినిమాకి రోబోటిక్స్ అద్భుతంగా వ‌ర్క‌వుటైంది. ‘2.0’ సినిమాకు వర్క్ చేసిన టీం ఈ సినిమాకు కూడా వర్క్ చేసింది. సుమారు ఒక రోజుకు 2.5 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి.. ఖ‌రీదైన కెమెరాల్నితెచ్చి షూట్ చేసాం. అందుకే బెస్ట్ క్వాలిటీ విజువ‌ల్స్ ను మనం లిసాలో చూడొచ్చు.

తెలుగు తమిళ్ రెండు చోట్ల ఒకే సారి రిలీజ్ చేస్తున్నారు. ఇది తెలుగులో డబ్ చేసారా ?

లేదండి. ఇది తెలుగు స్ట్రెయిట్ సినిమా. త‌మిళంలోనే అనువ‌దించి విడుదల చేస్తున్నాం. గతంలో తెలుగులో ‘పిజ్జా’ అనే హారర్ చిత్రాన్ని రిలీజ్ చేశాం. ఆ సినిమా ఎంత పెద్ద స‌క్సెసైందో తెలిసిందే. ఇక ఒక పంపిణీదారుగా.. ఎగ్జిబిట‌ర్‌గా ఎంతో అనుభ‌వంతో అన్ని ప‌క్కా క్యాలిక్యులేష‌న్స్‌ తోనే ఈ సినిమాను విడుదల చేస్తున్నాను. ఈ సినిమా పై నాకు బాగా నమ్మకం ఉంది.

మీరు తెలుగు ప్రేక్షకులకు ‘ప్రేమిస్తే, షాపింగ్ మాల్, జ‌ర్నీ’ లాంటి విజయవంతమైన చిత్రాలని అందించారు. ఈ చిత్రం కూడా ఆ చిత్రాల సరసన చేరుతుందా ?

ప్రేమిస్తే, షాపింగ్ మాల్, జ‌ర్నీ చిత్రాలు ఎంత పెద్ద విజ‌యం సాధించాయో… ఈ చిత్రం అంత‌కుమించిన ఘ‌న‌విజయం సాధించబోతుంది.

మరి ఈ సినిమా పైన ఆ స్థాయిలో అంచనాలు ఉన్నాయా ?

ఉన్నాయి. లిసా విడుదల అవ్వబోతుందని తెలిసి.. వెంట‌నే ఒక బ‌య్య‌రు వచ్చి ఆరు జిల్లాల‌కు కొనుక్కున్నారు. సినిమాకు బిజినెస్ ఓపెన్ చేసిన రెండో రోజుకే బిజినెస్ మొత్తం పూర్త‌యింది. దీన్ని బట్టి సినిమా పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

సినిమాలో అంజలి నటన గురించి చెప్పండి ?

అంజ‌లి ఎంత అద్భుతంగా నటిస్తోందో అందరికీ తెలుసు. అయితే ఈ సినిమాలో అంజలి ఇంకా అద్భుతంగా నటించింది. మొత్తానికి లిసా మిమ్మల్ని అందర్నీ ఆకట్టుకుంటుంది.

సంబంధిత సమాచారం :

More