ఈమధ్య కాలంలో తమిళ సినీ పరిశ్రమ నుండి కొన్ని మంచి సినిమాలు వచ్చాయి. ఇవి కేవలం తమిళ ప్రేక్షకులనే కాకుండా ఇతర భాషల ప్రేక్షకుల్ని కూడ అలరించాయి. వాటిలో ధనుష్ నటించిన ‘అసురన్’, సూర్య చేసిన ‘సూరరై పొట్రు’ సినిమాలున్నాయి. ఈ మంచి విజయాలను అందుకున్న ఈ చిత్రాలు తాజాగా మరొక ఘనతను సొంతం చేసుకున్నాయి. ఈ రెండు సినిమాలను 78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకల్లో ప్రదర్శించనున్నారు. లాస్ ఏంజిల్స్ నందు జనవరిలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరీలో తమిళ పరిశ్రమ తరపున ఇవి ఎంపికయ్యాయి.
ధనుష్ హీరోగా నటించిన ‘అసురన్’ సినిమాను వెట్రి మారన్ డైరెక్ట్ చేశారు. గత ఏడాది విడుదలైన ఈ సినిమా ధనుష్ కెరీర్లోనే ఉత్తమ చిత్రంగా నిలిచింది. దీన్ని తెలుగులో వెంకటేష్ ‘నారప్ప’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇక సూర్య చేసిన ‘సూరరై పొట్రు’ చిత్రం ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలై మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగులో కూడ ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదలై ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాలు మంచి సినిమా అనే పేరుతో పాటు కమర్షియల్ గా కూడ విజయాన్ని సాధించాయి. ఈ రెండింటికీ జీవీ ప్రకాష్ సంగీతం అందజేశారు.


