విశ్రాంతి తీసుకోనంటున్న సూర్య!
Published on Nov 2, 2016 9:30 am IST

suriya
తమిళ స్టార్ హీరో సూర్య విశ్రాంతి అన్నదే లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈ ఏడాది వేసవిలో వచ్చిన ’24’తో మంచి క్లాస్ హిట్ కొట్టిన సూర్య, తాజాగా తన స్టైల్లో ఓ భారీ మాస్ హిట్ కొట్టేందుకు డిసెంబర్ నెలలో ‘సింగం 3’ని విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూట్ మొత్తం ఈమధ్యే ఇలా పూర్తైందో లేదో అప్పుడే తన కొత్త సినిమాను కూడా మొదలుపెట్టేశారాయన. ‘తానా సెరిందా కూట్టం’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా నేడు చెన్నైలో పూజా కార్యక్రమాలతో మొదలైంది.

‘నేనూ రౌడీనే’ (నానుమ్ రౌడీధాన్) అనే సినిమాతో తమిళనాట దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజ్ఞేష్ శివన్ తెరకెక్కించనున్న ఈ సినిమా సూర్య స్టైల్లో మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందట. రెగ్యులర్ షూటింగ్ కూడా శరవేగంగా జరిపి సమ్మర్ చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా టీమ్ ప్లాన్ చేస్తోంది. సూర్య సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది.

 
Like us on Facebook