తండ్రి కోరిక నెరవేర్చిన స్టార్ బ్రదర్స్!

27th, October 2016 - 05:27:38 PM

suriya-karthi
సూర్య, కార్తీలకు తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తండ్రి శివకుమార్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినీ పరిశ్రమలోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన ఈ ఇద్దరూ ఇప్పుడు స్టార్ హీరోలుగా కొనసాగుతూ తమ తండ్రికి ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టారు. ఇక తాజాగా ఈ స్టార్ బ్రదర్స్ ఎప్పట్నుంచో శివకుమార్‌కు ఉన్న ఒక కోరికను నెరవేర్చి తమ ప్రేమను చాటుకున్నారు. శివకుమార్ కాలేజీ చదివే రోజుల నుంచే పెయింటింగ్స్ వేసేవారట. అలా తన జీవితంలో చాలా ప్రయాణాల్లో ఆయన వేసిన పెయింటింగ్స్ అన్నింటినీ ఒక దగ్గర చేరుస్తూ పెయింటింగ్స్ ఆఫ్ శివకుమార్ అన్న ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు.

శివకుమార్ 75వ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన సమక్షంలో చెన్నైలోని లలిత కళా అకాడమీలో ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ మొదలుపెట్టారు. ఇలా తమ తండ్రి కోరికను నెరవేరుస్తూ ఆయన పెయింటింగ్స్ ఎగ్జిబిషన్‌ నిర్వహించేలా చేయడం చాలా ఆనందంగా ఉందని, ఆయన పేరు మీద తమిళ సినిమాల్లో ఒక అవార్డు కూడా మొదలుపెట్టాలన్న ఆలోచన ఉందని తెలుపుతూ సూర్య తన ఆనందాన్ని వెలిబుచ్చారు. ఈ స్టార్ బ్రదర్స్ శివకుమార్‌తో కలిసి ఫోటోకు పోజ్ ఇవ్వడం నిన్నటి కార్యక్రమంలో హైలైట్‍గా నిలిచింది.