
సరికొత్త కథలతో, విభిన్న గెటప్‌లతో మనల్ని మెప్పిస్తూ ఉండే తమిళ సూపర్ స్టార్ సూర్య, ప్రయోగాలు చేయడంలోనూ ఎప్పుడూ ముందుంటారు. కొత్తతరం దర్శకులైతే తనను బాగా ప్రెజెంట్ చేయగలరన్న నమ్మకంతో సూర్య గతంలో చాలా సినిమాలు చేశారు. ఇప్పుడదే కోవలో ఒకే ఒక్క సినిమా చేసిన మరో యువ దర్శకుడికి చాన్స్ ఇచ్చారు సూర్య. హెచ్. వినోద్ అనే దర్శకత్వంలో నటించేందుకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ప్రస్తుతం మాస్(రాక్షసుడు) సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసిన సూర్య, ఇప్పటికే ‘మనం’ దర్శకుడు విక్రమ్ కుమార్‌తో ’24’ అనే సినిమా మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
’24’ సినిమా తర్వాత సూర్య, ‘సింగం 3’ షూటింగ్‌లో పాల్గొంటారు. ఇక ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాక వినోద్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం సిద్ధం కానున్నారు సూర్య. సథురంగ వెట్టై వినోద్ మొదటి సినిమా. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను మెచ్చిన సూర్య, వినోద్‌కు అవకాశం ఇచ్చారు. ఇక సూర్య తాజా సినిమా ‘మాస్’ తెలుగులో రాక్షసుడు పేరుతో విడుదల కానున్న విషయం తెలిసిందే. నేడు తెలుగు వర్షన్ ఆడియో రిలీజ్ జరగనుండగా, మే 29న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కానుంది.

