మెగాస్టార్ – పవర్ స్టార్ మల్టీస్టారర్ ఖాయం !
Published on Feb 23, 2017 5:58 pm IST


‘ఖైదీ నెం 150’ విడుదల చిత్రం సందర్బంగా చిరంజీవికి సత్కార సభ ఏర్పాటు చేసి గ్రాండ్ పార్టీ ఇచ్చిన ప్రముఖ నిర్మాత, రాజకీయవేత్త, పారిశ్రామికవేత్త టి. సుబ్బరామిరెడ్డి ఆ సమయంలో చిరంజీవి, మల్టీ స్టారర్ నిర్మిస్తానని ప్రకటించారు. అక్కడే ఉన్న చిరంజీవి కూడా నవ్వుతూ సుబ్బరామిరెడ్డి మాటలకు సంఘీభావం తెలిపారు. దీంతో ఎన్నో ఏళ్ల తమ కల నిజమవుతున్నందుకు మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకున్నంత పనిచేశారు.

కానీ ఆ తర్వాత రెండు మూడు రోజులకు ఈ మెగా మల్టీస్టారర్ రూపుదిద్దుకోవడం కష్టమని వార్తలొచ్చాయి పైగా యూఎస్ టూర్ వెళ్లిన పవన్ కూడా అన్నయ్యతో సినిమా విషయమై తాననెవరూ సంప్రదించలేదని చెప్పడంతో ఇక మెగా మూవీ లేనట్టేనని ఫాన్స్ నిరుత్సాహపడిపోయారు. కానీ తాజాగా మీడియాతో మాట్లాడిన సుబ్బరామిరెడ్డి ఈ సినిమా ఉంటుందని బల్లగుద్ది చెప్తున్నారు.

అప్పుడెప్పుడో ‘రౌడీ షీటర్’ సినిమా తర్వాత మరో సినిమా నిర్మించని ఆయన తెలుగులో ఒకప్పటిలా మల్టీస్టారర్ సినిమాలు రావాలని ఈ సినిమాని నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే పవన్ తో మాట్లాడానని, ఆయన సంతోషంగా ఒప్పుకున్నాడని, వీరిద్దరినీ హ్యాండిల్ చేయగల దర్శకుడు త్రివిక్రమ్ అని భావించి మంచి కథను సిద్ధం చేసే పని ఆయనకు అప్పగించామని, నిర్మాణంలో తనకు సహాయంగా అశ్వినిదత్ ముందుకొచ్చారని, ఒకసారి చిరు,పవన్ లు ప్రస్తుతం ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తిచేయగానే ఈ సినిమా మొదలవుతుందని అన్నారు. ఈ ప్రకటన అభిమానుల్లో మళ్ళీ పాత ఉత్సాహాన్ని నింపింది.

 
Like us on Facebook